ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు నేడు వైసీపీ నేతల ఇళ్ళలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్‌ల ఇళ్ళలో సోదాలు నిర్వహించారు.
ఏపీ సిట్ నివేదిక ఆధారంగా హైదరాబాద్, తిరుపతి, విజయవాడలోని వారి ఇళ్ళలో సోదాలు నిర్వహిస్తున్నారు. మద్యం కుంభకోణం ద్వారా లభించిన వెయ్యి కోట్లు ముడుపులు వారి షెల్ కంపెనీలకు మళ్ళించినట్లు సిట్ పేర్కొంది. దాని నివేదిక ఆధారంగా ఈడీ నేడు సోదాలు నిర్వహించింది.
అసలు మద్యం కుంభకోణమే జరగలేదని, తమని వేధించేందుకే సిఎం చంద్రబాబు నాయుడు తమపై ఈ తప్పుడు కేసు నమోదు చేయించ్గారని వైసీపీ నేతలు, ముఖ్యంగా మేదావి సజ్జల వంటివారు వాదిస్తుంటారు. వారి సొంత మీడియా పుంఖానుపుంకాలుగా నకిలీ కేసు, వేధింపులు అంటూ కధనాలు ప్రచురిస్తూనే ఉంటుంది. సిట్, సీఐడీలు సిఎం చంద్రబాబు నాయుడు కనుసన్నలలోనే పనిచేస్తాయి కనుక వాటి విచారణపై తమకు నమ్మకం లేదని చెపుతుంటారు.
కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే ఈడీ ఇదే కేసులో వైసీపీ నేతలు, వారికి సహకరించినవారి ఇళ్ళలో సోదాలు నిర్వహిస్తోంది. అంటే అర్థం ఏమిటి? కుంభకోణం జరిగిందనేగా? జరగలేదంటే ఇప్పుడు కేంద్రాన్ని కూడా నిందించగలరా? వద్దనుకుంటే కుంభకోణం చేశామని ఒప్పుకోగలరా?




