జగన్‌ బెదిరింపులకు భయపడి ఒక్కరూ ముందుకు రాలే!

AP Medical Colleges Face Setback as PPP Tenders Fail

ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. మొత్తం పది కాలేజీలలో నాలుగు కాలేజీలను ప్రభుత్వం–ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో నిర్మించేందుకు టెండర్లు పిలిచింది.

కానీ కర్నూలు జిల్లా అదోనీలో ఒక్క కాలేజీకి మాత్రమే కిమ్స్ టెండర్ వేసింది. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతో పాటు మార్కాపురం, మదనపల్లెల్లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక్క టెండర్ కూడా పడలేదు.

ADVERTISEMENT

ఈ పరిస్థితికి కారణం, కూటమి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న వారిని తాను మళ్లీ అధికారంలోకి రాగానే జైల్లో వేస్తానని జగన్ బెదిరించడమేనని ప్రచారం జరుగుతోంది. ఆ భయం నిజంగానే పనిచేసినట్టుగా పరిస్థితులు చెబుతున్నాయి.

మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం లేదని, పీపీపీ విధానంలో మాత్రమే నిర్మించి నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పదేపదే స్పష్టం చేశారు. అయినా జగన్ దీనినే ప్రైవేటీకరణగా చిత్రీకరిస్తూ వ్యతిరేక ఉద్యమాలకు పిలుపునిచ్చారు.

ఆయన సూచన మేరకు వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టి, కోటి సంతకాలు సేకరించారు. ఈ ఉద్యమం ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ ఒత్తిడి పెంచే ప్రయత్నంగా మారింది.

మరోవైపు జగన్ మళ్లీ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, ఆయన బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదేపదే భరోసా ఇచ్చారు. కానీ భరోసా కంటే బెదిరింపులే ప్రభావవంతంగా పనిచేశాయన్న భావన బలపడింది.

దీంతో జగన్ చేతిలో పదవి, అధికారం లేకపోయినా కూటమి ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ప్రభావం చూపగలుగుతున్నారన్న వాదనకు బలం చేకూరుతోంది. ఇది ప్రభుత్వ బలహీనతకూ సంకేతంగా మారుతోంది.

ఒకవేళ జగన్ బెదిరింపుల కారణంగానే మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదన్నది నిజమైతే, అది కూటమి ప్రభుత్వానికి తీరని అప్రతిష్టే అవుతుంది.

నేడు మెడికల్ కాలేజీల విషయంలో భయపడి వెనక్కి తగ్గినవారు, రేపు పెట్టుబడిదారులు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు కూడా ఏపీకి రావడానికి వెనుకాడరా అనే ప్రశ్న తలెత్తుతుంది.

ADVERTISEMENT
Latest Stories