హైదరాబాద్ మెట్రో నష్టాల్లో కూరుకుపోవడంతో దానిని నిర్మించి నిర్వహిస్తున్న ఎల్&టి కంపెనీ చేతులెత్తేసింది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాని పెట్టుబడి, బకాయిలు అన్నీ చెల్లించి మెట్రోని స్వాధీనం చేసుకొని స్వయంగా నడిపించాల్సి వస్తోంది.
తాజాగా మధ్యప్రదేశ్ మెట్రో పరిస్థితి కూడా దయనీయంగా మారింది. నష్టాలలో కూరుకుపోతోంది. కానీ ఇంకా చేతులేత్తేయలేదు. మెట్రోని కాపాడుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తోంది. ఇదివరకు మెట్రోలో ఎవరైనా రీల్స్ చేస్తే వారిపై కేసులు నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు ఎంపీ మెట్రో స్వయంగా ‘సెలబ్రేషన్స్ ఆన్ వీల్స్’ పేరుతో మెట్రో స్టేషన్లు, నడుస్తున్న మెట్రో రైళ్ళలో సినిమాలు, వెబ్ సిరీస్ షూటింగ్ చేసుకునేందుకు పధకం ప్రకటించింది. అంతే కాదు.. ప్రీ-వెడ్డింగ్, బర్తే డే పార్టీలు, చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్, కిట్టీ పార్టీలు కూడా నిర్వహించుకోవచ్చు. దీని కోసం గంటకు రూ.5,000-7,000 అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
హైదరాబాద్‌లో రోజుకి నాలుగున్నర లక్షల మంది ప్రయాణికులతో మెట్రో రైళ్ళు కిటకిటలాడుతుంటాయి. అయినా నష్టాలలో కూరుకుపోయింది. ప్రజా రవాణా కోసం ఏర్పాటు చేసిన ఎంపీ-మెట్రో చివరికి ఈవిధంగా ఆదాయం సమకూర్చుకునే దుస్థితికి దిగజారడం గమనిస్తే ఏ ప్రభుత్వానికైనా మెట్రో గుదిబండగానే మారుతుందని స్పష్టమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విశాఖ, విజయవాడలో మెట్రో కారిడార్స్ ఏర్పాటు చేసేందుకు ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే.
కోల్‌కత్తాలోని అండర్ గ్రౌండ్ మెట్రోతో సహా దేశంలో అనేక నగరాలలో మెట్రో కారిడార్స్ నిర్మించి ‘మెట్రో గురూ’, ‘మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధిగాంచిన ఈ శ్రీధరన్ ఏమన్నారంటే, మెట్రో నిర్మాణ వ్యయం చాలా భారీగా ఉంటుంది. అయినా మెట్రో నిర్వహణ లాభసాటి కాదు. దాని కంటే ఎంఎంటిఎస్ లేదా లైట్ రైల్ సిస్టం తక్కువ ఖర్చుతో నిర్మించి నిర్వహించుకోవచ్చునని సలహా ఇచ్చారు.
కానీ భవిష్యత్‌లో పెరిగే జనాభా, అవసరాలకు మెట్రో అవసరమని ఏపీ ప్రభుత్వం భావించి ఆ దిశలో గట్టి ప్రయత్నాలు చేసింది. కానీ వివిధ కారణాలతో ఇంతవరకు ఏపీ మెట్రో ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. కానీ ఆ ఆలస్యమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇలాంటి సమస్యలలో చిక్కుకోకుండా కాపాడిందని చెప్పవచ్చు.
వివిధ రాష్ట్రాలలో ఈవిధంగా మునుగుతున్న మెట్రోలని దృష్టిలో ఉంచుకొని శ్రీధరన్ సలహా పాటించి విశాఖ, విజయవాడతో సహా అవసరమైన నగరాలు, పట్టణాలలో ఎంఎంటిఎస్ లేదా లైట్ రైల్ సిస్టం ఏర్పాటు చేసుకోవడం మంచిది. మెట్రో మోజుతో అడుగు ముందుకు వేస్తే తర్వాత ఇలాగే మెట్రో రైళ్ళలో కిట్టీ పార్టీలు చేసుకోవాల్సి వస్తుంది.




