చంద్రబాబుని దూషిస్తూ మంత్రులు కాలక్షేపం… దేనికంటే?

Chandrababu-Naiduఅందరిదీ ఒకదారి అయితే ఉలిపి కట్టెది మరో దారి అన్నట్లు, దేశంలో అన్ని రాష్ట్రాలు ఆర్ధికాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, మౌలికవసతుల అభివృద్ధిలో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోతుంటే, ఏపీ మాత్రం గత నాలుగున్నరేళ్ళుగా తిరోగమన దిశలో వెనక్కు సాగిపోతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పులు, ఛార్జీల బాదుడు, సంస్థలు, రోడ్ల పేర్లు మార్చడం, అన్నిటికీ వైసీపీ రంగులు వేసుకోవడం మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లు ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు శ్రుతి మించడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎప్పుడూ వేడిగానే ఉంటోంది.

మంత్రులు మీడియా ముందుకు వచ్చారంటే తమ శాఖల గురించి మాట్లాడుతారని ప్రజలు ఎదురుచూడటం సహజం. కానీ ఏ ఒక్కరూ తమ శాఖల గురించి మాట్లాడరు. వైసీపీ ప్రభుత్వంలో ‘సర్వం జగన్నాధం’లా సాగుతుంటుంది కనుక బహుశః మంత్రులెవరికీ తమ శాఖలపై అధికారం లేకపోయి ఉండవచ్చని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. బహుశః అందుకే మంత్రులు మీడియా ముందుకు వస్తే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ముగ్గురినీ దూషించడానికే, ఎద్దేవా చేయడానికే పరిమితమవుతున్నట్లున్నారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడుకి ఐ‌టి నోటీసులు రావడం ఏదో జాతీయ సమస్య అన్నట్లు అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగినా స్పందించని రాష్ట్ర మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

వారిలో ఏ ఒక్కరూ టమాటా రైతుల కష్టాల గురించి కానీ, రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు, విద్యుత్‌ చార్జీల బాదుడు గురించి కానీ మాట్లాడరు. వైసీపీ స్వయంగా ప్రతిపాదించిన మూడు రాజధానుల గురించి కూడా ఇప్పుడు ఎవరూ మాట్లాడకపోవడం గమనిస్తే దానిపై కూడా వైసీపీకి నిబద్దత లేదని అర్దమవుతోంది.

సిఎం జగన్మోహన్ రెడ్డి లండన్‌లో ఉన్నప్పుడు ఇక్కడ ఏపీలో అనూహ్యమైన రాజకీయపరిణామాలు ఏవీ జరుగకుండా నివారించేందుకే మంత్రులందరికీ ఈ పని అప్పగించిన్నట్లున్నారు. అందుకే మంత్రులందరూ చంద్రబాబు నాయుడుని దూషిస్తూ కాలక్షేపం చేస్తున్నట్లున్నారు. ఇందుకు వారిని చూసి జాలిపడాలేమో? రాష్ట్రంలో ఇటువంటి అనారోగ్య రాజకీయ వాతావరణం మునుపెన్నడూ చూడలేదు.

ADVERTISEMENT
Latest Stories