రాష్ట్ర విభజన తర్వాత కూటమి ప్రభుత్వం మొదటిసారి ఏపీలో అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నడూ వైసీపీ జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే అప్పుడు సిఎం చంద్రబాబు నాయుడుకి అంత తీరిక, ఆసక్తి రెండు లేవు కనుక. ఆయన దృష్టి అంతా విభజన సమస్యలు పరిష్కరించుకొని అమరావతి పనులు మొదలుపెట్టడం, రాష్ట్రాభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులపైనే ఉండేది.
విభజన కారణంగా రాష్ట్రంలో ప్రజలు కూడా తీవ్ర భావోద్వేగంతో ఉండేవారు. టీడీపి శ్రేణుల పరిస్థితి కూడా అదే. చివర్లో బిజేపితో విడిపోవడంతో ఏర్పడిన అయోమయం, సమస్యలతో 5 ఏళ్ళు చాలా బిజీబిజీగా గడిచిపోయాయి. కనుక జగన్, వైసీపీల గురించి ఆలోచించేందుకు కూడా సిఎం చంద్రబాబు నాయుడు తీరిక ఉండేది కాదు. చివరికి 2019 ఎన్నికల సమయంలో వివేకా హత్య కేసుపై కూడా దృష్టి సారించలేక ఎన్నికలలో ఎదురుదెబ్బ తిన్నారు.
నాడు చంద్రబాబు నాయుడు వైసీపీ, జగన్ జోలికి వెళ్ళకపోవడం వల్లనే జగన్ హ్యాపీగా పాదయాత్ర చేసుకోగలిగారు. కానీ ఇప్పుడు తాడేపల్లి ప్యాలస్ నుంచి కాలు బయట పెట్టేందుకు భయపడుతున్నారు. ఎందువల్ల?అంటే సమాధానం అందరికీ తెలుసు.
చంద్రబాబు నాయుడు తన జోలికి రాకపోయినా జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆయనపై, టీడీపి నేతలపై కక్ష సాధింపు చర్యలుమొదలుపెట్టేశారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడం కక్ష సాధింపులకి పరాకాష్ట. దానికి జగన్ కూడా భారీ మూల్యమే చెల్లించారు.
జగన్‌కి ప్రజలే శిక్షించారు కనుక ఇక వారిని పట్టించుకోనవసరం లేదని సిఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ అమరావతి, అభివృద్ధి పనులలో నిమగ్నమయ్యారు.
అందువల్లే శాసనసభలో చంద్రబాబు నాయుడుని దారుణంగా అవమానించి, ఆయన సతీమణి భువనేశ్వరిని ఉద్దేశ్యించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబుల జోలికి నేటికీ పోనే లేదు. పవన్ కళ్యాణ్‌ని దారుణంగా అవహేళన చేసిన జగన్ జోలికి పోనే లేదు.
ఐదేళ్ళ పాటు వేధించి, అవమానించి, జైల్లో పెట్టినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ తమ జోలికి రాకపోవడం జగన్‌కి, వైసీపీ నేతలకి అలుసుగా కనిపించింది. కనుక మళ్ళీ రప్పా రప్పా అంటూ రెచ్చిపోవడం మొదలుపెట్టారు.
అయినప్పటికీ వారు ముగ్గురూ ఉపేక్షిస్తుండటంతో సొంత పార్టీల నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులే వారి మెతక వైఖరిని తప్పుపడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారి ముగ్గురిపై అంతర్గతంగా అంత ఒత్తిడి ఏర్పడితే కానీ కూటమి ప్రభుత్వం వంశీ, పోసాని, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి వంటి దేశ ముదురు వైసీపీ నేతలని టచ్ చేయలేదు.
ఆ తర్వాత అవినీతి, అక్రమాల కేసులతో వైసీపీ నేతలలో చాలా మందిని లోపల వేసేయవచ్చు. కానీ తాము పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికి అధికారంలోకి రాలేదని వారు ముగ్గురూ స్పష్టం చేశారు.
వారి ఈ వైఖరే వైసీపీలు ‘రప్పా రప్పా’ అని బెదిరించే స్థాయికి తీసుకువెళ్ళిందని చెప్పక తప్పదు. అందుకే అంబటి రాంబాబు నిన్న గుంటూరులో అంతగా రెచ్చిపోయారు.
మనం ఎంతగా రెచ్చిపోయినా సిఎం చంద్రబాబు నాయుడు మనల్ని ఏమీ చేయరు… జస్ట్ ఓ కేసు పెట్టి వదిలేస్తారనే ధైర్యంతోనే అంబటి అంతగా రెచ్చిపోయారని అర్ధమవుతూనే ఉంది.
కానీ ఆయన మాటలు టీడీపి నేతలు, కార్యకర్తల అహం మీద దెబ్బ కొట్టాయి. గుంటూరు పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నప్పుడు, టీడీపి శ్రేణులు ఆయనపై ప్రదర్శించిన ఆగ్రహమే ఇందుకు నిదర్శనం.
కనుక అంబటి అనుకున్నట్లే కేసు నమోదు చేసి, బెయిల్‌పై ఇంటికి పంపించేస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం వైసీపీని కాదు ముందుగా పార్టీ శ్రేణుల ఆగ్రహం తట్టుకోవడమే చాలా కష్టం కావచ్చు.
ముఖ్యంగా ప్రభుత్వం మెతక వైఖరి నిసహాయతగా, చాతకానితనంగా కనిపిస్తుంటే, రోడ్లపై రప్పారప్పాలు సాగుతుంటే, పెట్టుబడి పెట్టాలని ముందుకు వస్తున్నవారు కూడా భయపడి వెనక్కు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక కూటమి ప్రభుత్వం ఇకనైనా రప్పారప్పాలకు కాస్త భయం పరిచయం చేయక తప్పదు.






