‘ప్రత్యేక హోదా’ రాదని తెలిసి, ఇచ్చిన ‘ప్యాకేజ్’తో సరిపెట్టుకున్న వైనం ఏపీ సర్కార్ దైతే, ‘ప్రత్యేక హోదా’ రాదని తెలిసి రాజకీయ ప్రయోజనాల కోసం కాస్త హడావుడి చేసి, చేతులు దులుపుకున్న వైనం ఏపీ ప్రతిపక్షానిది. ఇక, ఈ రెండు కాక మధ్యలో ఉన్న పవన్ కళ్యాణ్… ఎప్పుడు ఏం చేస్తారో కూడా ఆయనకే తెలియదన్న విమర్శలతో… ఏపీకి దక్కాల్సిన ‘స్పెషల్ స్టేటస్’ అంశం దాదాపుగా గాలికొదిలేసినట్లుగా తయారయ్యింది.
కానీ, ఈ అంశాన్ని హీరో శివాజీ మాత్రం వదిలిపెట్టేలా లేడు. ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ అధ్యక్షుడు హోదాలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు శివాజీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ పిల్ వేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రెండు వారాల తరువాత దీనిని విచారిస్తామని తెలిపింది. దీని పట్ల ప్రత్యేకహోదా సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది.
పునర్వ్యవస్థీకరణ బిల్లులో ప్రత్యేక హోదాలో పేర్కొందని, ప్యాకేజీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. శివాజీ తీసుకున్న నిర్ణయం ముదావహమని పేర్కొన్న చలసాని, రాష్ట్ర ప్రయోజనాలను నేతలు గాలికొదిలేస్తే, ప్రజల తరపున శివాజీ పిల్ దాఖలు చేయడం, దానిని హైకోర్టు విచారణకు స్వీకరించడం హర్షణీయమని అన్నారు.



