రాష్ట్ర విభజన జరుగుతునప్పుడు ‘రాష్ట్రాలుగా విడిపోదాం అన్నదమ్ములా కలిసుందాం,’ అని బీఆర్ఎస్ నేతలు సుద్దులు చెప్పారు. దానికి వారు ఏనాడు కట్టుబడి ఉండలేదు. కానీ నేటికీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారు!
ఏపీకి ఎగువన ఉన్న తెలంగాణలో గోదావరి నదిపై ఇంకా ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని స్పష్టంగా చెప్పారు. రెండు రాష్ట్రాలు ఎన్ని నీళ్ళు వాడుకున్నా గోదావరి మిగులు జలాలు సముద్రంలో కలుస్తూనే ఉంటాయని, కనుక ఆ నీటిని ఏపీ, తెలంగాణలు వాడుకొని అందరూ ప్రయోజనం పొందాలని సిఎం చంద్రబాబు నాయుడు చెపుతుంటారు.
మాజీ మంత్రి కేటీఆర్ నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “నీళ్ళ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. పట్టిసీమతో గోదావరి నీళ్ళను ఎత్తిపోసుకుంటూ పంటలను కాపాడుకుంటోంది,” అని మెచ్చుకున్నారు.
కేటీఆర్ ఇప్పుడైనా ఎందుకు మెచ్చుకున్నారంటే సిఎం రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు వాడుకోకుండా దిగువకు వదిలేస్తున్నారని నొక్కి చెప్పేందుకే. అది వేరే విషయం.
కానీ నీళ్ళ వాడకం విషయంలో సిఎం చంద్రబాబు నాయుడి ఆలోచనలు సరైనవేనని బీఆర్ఎస్ నేతలకు తెలుసని కేటీఆర్ మాటలతో స్పష్టమైంది కదా?
ఒక్క నీళ్ళ విషయంలోనే కాదు… తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో కూడా సిఎం చంద్రబాబు నాయుడు పరోక్షంగా సహకరిస్తూనే ఉన్నారు.
వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని సిఎం చంద్రబాబు నాయుడు తనకు పదేపదే చెప్తుంటారని పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల బయటపెట్టారు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. గతంలో టీడీపిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, స్వర్గీయ కింజారపు ఎర్రంనాయుడుతో తనకున్న అనుబంధాలు ఇప్పుడు అక్కరకు వస్తున్నాయన్నారు. విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తనకు చాలా సహకరిస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
సిఎం రేవంత్ రెడ్డి కోరినట్లే 2028, జూన్ 2నాటికి వరంగల్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించి ఇస్తామని పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మొన్న ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.
కనుక సిఎం చంద్రబాబు నాయుడుని, ఆంధ్రాని ద్వేషిస్తూ, నీళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తూ మైలేజ్ పొందాలని ప్రయత్నించే బదులు, ‘పరస్పరం సహకరించుకుంటూ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందామనే’ చంద్రబాబు నాయుడు సలహాని పాటిస్తే అందరికీ మేలు కలుగుతుంది కదా?




