ఒక్కోసారి ఒక ఫోటో, వీడియో చూస్తే కొన్ని పాత జ్ఞాపకాలు టక్కున గుర్తుకువస్తుంటాయి. అలాంటిదే ఈ ఫోటో కూడా.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామితో భేటీ అయినప్పుడు తీసిన ఫోటో ఇది.
ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ప్లాంట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని కోరేందుకు వారు ఆయనని కలిశారు. ఇక్కడ చర్చ దాని గురించి కాదు. ఓడలు బళ్ళు అవడం గురించి!
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలనుకున్నారు. ఆ సమయానికి కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి.
కనుక కేసీఆర్ ప్రత్యేక విమానం వేసుకొని బెంగళూరు వెళ్ళి ప్రతిపక్ష జేడిఎస్ అధినేత హెచ్.డి. దేవగౌడ, ఆయన కుమారుడు కుమార స్వామిని కలిశారు.
ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేద్దామన్నారు. కుమార స్వామిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్, బిజేపిల మద్యనే అధికార మార్పిడి జరుగుతోంది. కనుక తండ్రీకొడుకులు కేసీఆర్ మాటలు నమ్మారు.
అప్పటి నుంచి కుమార స్వామి కేసీఆర్ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టారు. కానీ సరిగ్గా ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేసరికి కేసీఆర్ ఆయనకి హ్యాండ్ ఇచ్చేశారు!
వారి పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళలేదు. కనీసం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరినీ పంపించలేదు కూడా.
చివరి నిమిషం వరకు కేసీఆర్ సాయం కోసం ఎదురుచూశానని, కానీ అయన తనకు హ్యాండ్ ఇచ్చారని కుమార స్వామి అప్పట్లో బహిరంగంగానే వాపోయారు. మీడియాలో కూడా దీని గురించి చాలా కథనాలు వచ్చాయి కూడా. కనుక ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బహుశః చాలా మందికి గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడెందుకు ఈ స్టోరీ అంటే, నాడు ఆయనకు హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్ రెండున్నరేళ్ళుగా ఫామ్‌హౌసులోనే ఉండిపోగా, కుమారస్వామి ఎన్డీఏలో చేరి ఇప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఉన్నారు.
గతంలో ఆయన కేసీఆర్ చుట్టూ తిరిగితే, ఇప్పుడు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ వినతిపత్రం పట్టుకొని కుమారస్వామి వద్దకు వెళ్ళి సాయం అర్ధించాల్సి వచ్చింది. ఓడలు బళ్ళు అవడం అంటే ఇదేనా?




