నేటి బంధాలే రేపటి బలాలా.?

Political bonds between AP and Telangana leaders strengthening ahead of future elections

రాజకీయాలలో పైకి ఎదగడానికైనా, కిందకు పడడానికైనా పార్టీల మధ్య ఏర్పడిన కొన్ని బంధాలు, ఆ పార్టీల నాయకుల మధ్య కుదిరిన మరికొన్ని అనుబంధాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయనేది రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలను గమనిస్తే ఇట్టే అర్ధమవుతుంది.

బాబు – పవన్ ల మధ్య ఏర్పడిన బంధం ఏపీలో కూటమికి అధికార పీఠాన్ని కట్టబెట్టింది, అలాగే టీడీపీ – రేవంత్ కు ఉన్న అనుబంధం ఆయనను తెలంగాణ నాయకుడిగా మార్చింది. అయితే ఇలా బంధాలు – అనుబంధాలు రాజకీయ లబ్దినే కాదు ఒక్కోసారి రాజకీయ పతనాన్ని కూడా అందిస్తాయి.

ADVERTISEMENT

అందుకు వైసీపీ – బిఆర్ఎస్ ల మధ్య ఏర్పడిన బంధం, కేసీఆర్ – జగన్ ల మధ్య కుదిరిన అనుబంధం ప్రత్యక్ష ఉదాహరణ. అయితే ఇప్పుడు ఈ పార్టీల మధ్య బంధాలు, నాయకుల మధ్య ఉన్న అనుబంధాలు రేపటి రాజకీయానికి బలాన్ని ఇవ్వనున్నాయా.?

ఆ బలాన్ని తమ పార్టీలకు సానుకూలంగా, తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇరు రాష్ట్రాల నాయకులు ఇప్పటి నుంచే తమ రాజకీయాన్ని మొదలు పెడుతున్నారా.? అన్న అనేక ప్రశ్నలకు తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలే నిదర్శనం.

అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం, సందర్భం చిక్కినప్పుడల్లా తనకు టీడీపీ తో ఉన్న అనుబంధాన్ని, బాబు పై తనకున్న ఆప్యాతను, గౌరవాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారా.? తద్వారా తెలంగాణలో టీడీపీ మద్దతుదారులను తన ఓట్ బ్యాంకు గా మలచుకుంటున్నారా.?

బాబు కూడా రేవంత్ తనవాడు అనేలా రేవంత్ నాయకత్వానికి తన చర్యలతో ప్రోత్సహిస్తున్నారా.? మొన్నఈమధ్య హైద్రాబాద్ లో జరిగిన ఈటీవీ అధినేత రామోజీరావు జయంతి వేడుకలలో బాబు – రేవంత్ ల కలయిక, వారి మధ్య సాగిన సరదా సంభాషణ ఇదే విషయాన్ని బలపరిచిందా.?

అలాగే పుట్టపర్తి లో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి వేడుకలలో పాల్గొన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాబు – రేవంత్ తమ ఈ బంధం – అనుబంధం ఎప్పటికి ఇలానే ఉంటుందని అది రేపటి తమ పార్టీల బలంగా మారుతుందని చెప్పదలచుకున్నారా.?

ఆ ప్రక్రియలో భాగంగానే రేవంత్ ‘మనందరి అభిమాన నాయకుడు’ గౌరవనీయులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ సంభోదించారా.? అదేవిధంగా బాబు కూడా రేవంత్ కు తగిన ప్రాధాన్యం ఇస్తున్నారా.?

ఇక వైసీపీ – బిఆర్ఎస్ కూడా తమ బలాలను, తమ పార్టీల మధ్య అనుబంధాన్ని ఇరు రాష్ట్ర ప్రజలకు మరోసారి బహిరంగ పరిచేందుకు సిద్దమయ్యారా.? తాజాగా బెంగళూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధినేత వైస్ జగన్ పాల్గొన్నారు.

అయితే అందుకు సంబంధించిన ఫొటోలను మాజీ మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. తనకు జగన్ అన్న లాంటి వాడంటూ సంభోదించిన కేటీఆర్ తనకు, తన పార్టీకి భవిష్యత్ లో కూడా జగన్ మద్దతు, వైసీపీ అండ ఉంటుందనే సంకేతాన్ని తెలంగాణలో జగన్ సామజిక వర్గానికి బహిరంగ పరిచాలనుకుంటున్నారా.?

అందుకే తమ ఈ కలయికను కేటీఆర్ ప్రచారం చేస్తున్నారా.? లేక తెలంగాణలో రేవంత్ – బాబు జోడికి ప్రతిగా జగన్ – కేటీఆర్ ల దోస్తీని చూపాలని భావిస్తున్నారా.? అయితే ఏది ఏమైనప్పటికి ఈ నాలుగు పార్టీల మధ్య ఉన్న బంధాలు ఆ ఆనలుగురు నాయకుల మధ్య కుదిరిన అనుబంధాలు నాలుగు పార్టీల మద్దతుదారులకు మంచి జోష్ నైతే నింపుతున్నాయి.

అలాగే ఈ రెండు రాష్ట్రాల మధ్య, ఆ నలుగురి నాయకుల మధ్య ఏర్పడిన ఈ రాజకీయ బంధాలు – అనుబంధాలు భవిష్యత్ లో ఎవరికీ బలంగా మారనున్నాయి.? ఏ పార్టీని బలహీన పరచనున్నాయి.? అనేది కాలమే జవాబు చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories