ఏపీలో చల్లగా…తెలంగాణలో వేడిగా…

Comparison of AP and Telangana politics from dullness to heated clashes

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ్య చిత్రాన్ని పరిశీలిస్తే ఏపీ రాజకీయాలు తెలంగాణ పాలిటిక్స్ తో పోలిస్తే కాస్త చప్పగా సాగుతున్నాయనే చెప్పాలి. ఏపీలో కేవలం వైసీపీ రప్ప రప్ప నినాదాలు తప్ప ప్రతిపక్షంగా వైసీపీ మరేఇతర అంశాలలోను చురుకుగా పాల్గొనడం లేదు.

ఇక తెలంగాణ విషయానికొస్తే అక్కడ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇన్నాళ్లు ఫామ్ హౌస్ లో అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆయన రాజకీయ వారసులుగా కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు పార్టీని ముందుండి నడిపించారు.

ADVERTISEMENT

అలాగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతూ అధికార కాంగ్రెస్ నేతలకు ధీటుగా జవాబులిస్తూ, వారి విమర్శలకు కౌంటర్ లు వేస్తూ గులాబీ సైన్యానికి ఒక భరోసాలా కనిపించారు. ఇక ఇప్పుడు కేసీఆర్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా కేసీఆర్ ఫామ్ హౌస్ గడప దాటి అసెంబ్లీ గడప తొక్కారు.

ఏపీలో వైసీపీ సంగతి చూస్తే ఈ పార్టీలో జగన్ తరువాత అంతటి పొలిటికల్ ఛరిష్మా , మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకులెవ్వరూ లేకపోవడంతో వైసీపీలో జగన్ వన్ మాన్ షో అన్నట్టుగా కేవలం జగన్ ఏపీలో అడుగుపెట్టి ఓదార్పు యాత్రలో, పరామర్శల పర్యటనలో చేసినప్పుడు మాత్రమే వైసీపీ జనం నోళ్ళలో నానుతుంది.

అది కూడా రేపటి రోజున వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి.? ఏపీ యువత భవిష్యత్ కి దారేది అనే ప్రశ్నలతో, అనుమానాలతో…! ఇక పార్టీ ఓటమి నాటి నుంచి వైసీపీ రాజకీయంలో బెదిరింపు బరితెగించిందా అన్నట్టుగా ప్రభుత్వ అధికారుల నుంచి కాంట్రాక్టుల వరకు వైసీపీ హెచ్చరికలు పరిధి దాటి పరిమితులు దాటి ముందుకెళ్తున్నాయి.

అలాగే తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ కి తోడు ఒక పక్క బీజేపీ మరోపక్క కవిత తెలంగాణ రాజకీయాలలో హీట్ రాజేస్తున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ పై ఆ పార్టీ ముఖ్య నేత హరీష్ పై కవిత చేస్తున్న రాజకీయ యుద్ధం, గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో మంత్రులుగా ఉన్న నేతలు సాగించిన అవినీతి పురాణాలు అన్నింటిని ఒక్కొక్కటిగా కవిత బయటపెడుతూ అటు బిఆర్ఎస్ కారు జోరుకి బ్రేకులు వేస్తూ కాంగ్రెస్ చేతికి అస్త్రాలను అందిస్తుంది.

ఇక బీజేపీ…తెలంగాణ బీజేపీ కనీసం ఆ పార్టీ నేతలకు, క్యాడర్ కూడా అర్ధం కానీ రాజకీయాన్ని నడుపుతూ, తెలంగాణలో బీజేపీ పోరాటాలు అధికారం కోసమా.? లేక మరో పార్టీ కి అవకాశం కోసమా.? అన్నటుగా ముందుకు సాగుతున్నాయి. ఇలా తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఏదోలా చప్పుడు చేస్తూనే ఉన్నాయి.

అయితే ఏపీలో అసలు ప్రతిపక్షం అనే మాటకే స్థానం లేకుండా కూటమి ఘన విజయాన్ని అందుకుంది. దానికి తోడు 11 మంది ఎమ్మెల్యే లతో జగన్ అండ్ కో అసెంబ్లీని కూడా బహిష్కరించడంతో ఏపీ రాజకీయాలలో ఆ వాడి వేడి చర్చలకు ఆస్కారం లేకుండా పోయింది.

అలాగే ఏపీ రాజకీయాలలో కాంగ్రెస్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్న షర్మిల కూడా ఎన్నికల తరువాత కనుమరుగయిపోయారు. ఆమె రాజకీయం కేవలం కాలక్షేపానికే పరిమితమయ్యింది కానీ ప్రజలలో పట్టుతెచ్చుకోలేకపోయింది. అందువల్ల ఏపీలో రాజకీయం తెలంగాణ రాజకీయాల మాదిరి వాడి వేడిగా కాకూండా చల్లగా, చప్పగా సాగుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories