విశాఖలో గ్లాస్ బ్రిడ్జ్… అరకులో ఎయిర్ బెలూన్ రైడ్!

Hot Air Baloon Raid in Araku

పర్యాటక రంగం బంగారుబాతు వంటిదని గ్రహించడానికి మనకి దశాబ్దాలు పట్టింది. ముఖ్యంగా ఆంధ్రాలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వాటిలో పర్యాటకరంగం అగ్రస్థానంలో ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం దానికి పరిశ్రమ హోదా ఇచ్చినప్పటి నుంచి భారీగా ప్రైవేట్ పెట్టుబడులు వస్తున్నాయి. కొత్త కొత్త అవకాశాలు, ఆకర్షణలు కనిపిస్తున్నాయి.

ఇందుకు తాజా ఉదాహరణగా విశాఖ నగరంలో రామకృష్ణా బీచ్ వద్ద నుంచి తోట్లకొండ వరకు సముద్రతీరం వెంబడి సాగే సువిశాలమైన రోడ్డుపై డబుల్ డెక్కర్ బస్సులను సిఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే ప్రారంభించారు. దాని తర్వాత కైలాసగిరి కొండపై గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఈ రెండూ ఇప్పుడు విశాఖలో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా మారాయి.

ADVERTISEMENT

సాధారణంగా విశాఖ వచ్చిన పర్యాటకులు అరకు అందాలు చూడకుండా తిరిగి వెళ్ళరు. అరకు చేరుకునేందుకు విశాఖ రైల్వే స్టేషన్‌ నుంచి అద్దాలు బిగించిన ‘విస్టా డోమ్ కోచ్’తో కూడిన ప్యాసింజర్ రైలు ఎప్పటి నుంచో ప్రతీరోజూ నడుస్తోంది. కొండలు, గుహలలో నుంచి లోయల పక్కగా సాగే దానిలో ప్రయాణమే ఓ మహాద్భుతం.

ఇప్పుడు అరకులో మరో పర్యాటక ఆకర్షణ జోడించారు. అదే… హాట్ ఎయిర్ బెలూన్ రైడ్. అరకులో చాలా ఫేమస్ పద్మాపురం ఉద్యానవనంలో పాడేరు ఐటీడీవో పీవో తిరుమణి శ్రీపూజ నేడు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ప్రారంభింఛి దానిలో కొంతసేపు విహరించారు.

ఈ హాట్ ఎయిర్ బెలూన్ రెయిడ్ సర్వీసులను పర్యాటకశాఖ అధ్వర్యంలో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. తొలిసారిగా దీనిని ఏపీలో ప్రవేశపెట్టారు. కనుక ముందుగా అనేకసార్లు విజయవంతంగా ట్రయల్స్ రన్స్ నిర్వహించి ఇది పర్యాటకులకు సురక్షితమే అని నిర్ధారించుకున్న తర్వాతనే పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చామని నిర్వాహకులు చెప్పారు. పర్యాటకులకు అందుబాటు ధరలోనే దీనిలో విహారించవచ్చని చెప్పారు.

త్వరలోనే పారా మోటార్ గ్లైడింగ్ కూడా అందుబాటులోకి తెస్తామని పాడేరు ఐటీడీవో పీవో తిరుమణి శ్రీపూజ చెప్పారు. అరకు-పాడేరు పర్యాటకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొంటూ వారి సూచనలు, అవసరాలకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమణి శ్రీపూజ చెప్పారు. కనుక అరకు పర్యటనకు వచ్చే పర్యాటకులు తప్పకుండా ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ చేసి మరింత మధురమైన అనుభూతి పొందాలని విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT
Latest Stories