పెరుగుతున్న భూముల ధరలు అభివృద్ధికి సూచికలు కావచ్చు కానీ..

Are Soaring Land Prices Hurting Andhra Pradesh Middle Class?

భూమి, బంగారం ఎప్పటికీ మంచి పెట్టుబడులే అని కాలమే నిరూపిస్తోంది. ఒకప్పుడు కొండలు, బండరాళ్ళతో నిండి ఉండే హైదరాబాద్‌లో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు ఇప్పుడు ఎకరం వందల కోట్లు పలుకుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలో అన్ని రాష్ట్రాలలో, జిల్లాలలో చివరికి.. మారుమూల ప్రాంతాలలో కూడా భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

విశాఖలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ మొదటి నుంచి భూముల ధరలు చాలా ఎక్కువగానే ఉండేవి. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే విశాఖలో ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’ కూడా చాలా ఎక్కువే.

ADVERTISEMENT

జగన్‌ హయంలో పాడిన ‘విశాఖ రాజధాని’ పాటతో విశాఖలో భూముల ధరలు మరింత పెరిగిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విశాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టి మెట్రో, ఐటి కంపెనీలు, భోగాపురం విమానాశ్రయం వగైరా ఏర్పాటు చేస్తుండటంతో భూముల ధరలు మరింత పెరిగిపోయాయి.

ఎంతగానో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరంలో కొన్ని ప్రాంతాలలో నేటికీ చదరపు గజం ధర లక్ష-లక్షన్నర రూపాయలుంటే, ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేని విశాఖలో కూడా దాదాపు అంతే ధరలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

హైదరాబాద్‌లో ఫ్లాట్స్ రూ.70 లక్షల నుంచి రెండు కోట్లు వరకు ఉంటే, విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి నగరాలలో కూడా రూ.70 లక్షల నుంచి కోటిన్నర వరకు ఉన్నాయి.

శరవేగంగా పెరుగుతున్న భూములు, అపార్ట్‌మెంట్స్ ధరలు అభివృద్ధికి సూచికలు అని అనుకోవచ్చు కానీ ఇంత వేగంగా, విపరీతంగా ధరలు పెరిగిపోయిన తర్వాత అదే రియల్ ఎస్టేట్ రంగానికి శాపంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది.

వందల కోట్లు పెట్టుబడి పెట్టి తీస్తున్న సినిమాలపై పెట్టుబడి రాబట్టుకోవడానికి టికెట్ రేట్స్ పెంచుకోవడం వలన ప్రేక్షకులు థియేటర్లకు రావడం ఏవిధంగా తగ్గిందో, అదే విధంగా భూములు ధరలు పెరుగుతున్న కొద్దీ అపార్ట్‌మెంట్స్ ధరలు కూడా పెరుగుతూపోతే సామాన్య, మద్య తరగతి ప్రజలు సొంత ఇల్లు ఆలోచన పక్కనపెట్టేసి అద్దె ఇళ్ళలో ఉంటూ, ఇంటిపై పెట్టాలనుకున్న ఆ సొమ్ముని ఇతర ఆదాయమార్గాలలో పెడతారు. దీని వలన రియల్ ఎస్టేట్ రంగం దెబ్బ తింటుంది.

హైదరాబాద్‌, కేపీహెచ్‌బీ కాలనీలో ఇటీవల ఖాళీగా ఉన్న ప్లాట్స్ వేలం వేస్తే చ. గజం రూ.28 లక్షలకు అమ్ముడుపోయింది. రెండు మూడేళ్ళ క్రితమే కోకాపేటలో ఎకరం రూ.101 కోట్లకు అమ్ముడుపోయింది. కనుక హైదరాబాద్‌లో ఇప్పటికే ఐటి ఉద్యోగులు కూడా సొంత ఇల్లు ఆలోచన పక్కన పెట్టి అద్దె ఇళ్ళలో కాలక్షేపం చేస్తున్నారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది కనుక రాబోయే రోజుల్లో ఏపీలో కూడా ఇదే జరుగవచ్చు.

సామాన్య, మద్య తరగతి ప్రజలు సొంత ఇల్లు కలని వదులుకోక తప్పని పరిస్థితులు ఏర్పడుతుండటం మంచిదేనా?అని ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories