చూస్తుండగానే తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. ఈ నెల 30న పోలింగ్ జరుగబోతోంది. డిసెంబర్ 3న ఫలితాలు కూడా వచ్చేస్తాయి. అంటే ఇంకా మూడు వారాలు మాత్రమే సమయం ఉందన్నమాట!
ఎన్నికలంటేనే రాజకీయ వ్యూహాలు, పరస్పరం కత్తులు దూసుకోవడాలు. అయితే సినిమాలలో కూడా హీరోలు కత్తులు పట్టుకొని విలన్లను నరుక్కొంటూపోతే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది కనుక మద్యలో విదేశాలకు తీసుకువెళ్ళి నాలుగు డ్యూయెట్స్ చూపించి, మద్యలో కామెడీ ట్రాక్ కూడా వేసి జనాలను కూర్చోబెడుతుంటారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల సభలలో కూడా అన్ని పార్టీలు కళాకారులతో కాస్త కళాపోషణ చేస్తూ ప్రజలను రంజింపజేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల డ్యాన్సులు వాటికి అదనం. సోషల్ మీడియాలో కార్టూన్స్ బోనస్ అనుకోవచ్చు.
ఈసారి కళాపోషణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మిగిలిన వాటి కంటే వేగంగా దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో అది పెడుతున్న కార్టూన్స్ చూస్తే దాని ప్రత్యర్ధులు కూడా హాయిగా నవ్వుకోకుండా ఉండలేరు. కానీ అదే సమయంలో అవి చాలా ఆలోచింపజేస్తున్నాయి కూడా.
తాజాగా హైదరాబాద్‌లో హైటెక్ సిటీ వద్ద ఓ ఫ్లైఓవర్‌పై కాంగ్రెస్ పార్టీ మూడు బొమ్మలతో చిన్న కటవుట్ పెట్టింది. దానిలో కేసీఆర్, మజ్లీస్ అధినేత ఓవైసీలను పైనుంచి ప్రధాని నరేంద్రమోడీ తోలుబొమ్మలను చేసి ఆడిస్తున్నట్లు చూపారు.
బీజేపీ, బిఆర్ఎస్, మజ్లీస్ మూడు పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అదే సూచిస్తూ ఏర్పాటు చేసిన ఈ చిత్రం అందరినీ చాలా ఆకట్టుకొంటోంది. అప్పుడే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ప్రజలను ప్రభావితం చేస్తాయని వేరే చెప్పక్కరలేదు. మరి ఏపీ ఎన్నికలు ఏవిదంగా సాగుతాయో?




