తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు జగన్ ప్రభుత్వంలో బీసీ మంత్రులు నోరులేని మూగజీవులని అభివర్ణించారు. గడపగడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతుండటంతో వాటి నుంచి తప్పించుకొనేందుకే బస్సు యాత్ర పెట్టుకొన్నారని, కానీ వాటికీ ప్రజా స్పందన కరువైందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత గౌరవం, పదవులు లభించాయని, కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి తానే మొట్ట మొదట వారికి పదవులు ఇచ్చినట్లు బస్సు యాత్రలు చేయిస్తూ వారితో చాటింపు వేసుకోవడం హాస్యస్పదంగా ఉందని అన్నారు.
“బస్సు యాత్ర చేస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులలో ఎవరైనా సిఎం జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయించగలరా?”అని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వారికి మంత్రి పదవులు లభించాయే తప్ప నిర్ణయాలు తీసుకొనే అధికారం మాత్రం లేదని, అది జగన్, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వద్దనే ఉండిపోయాయని అచ్చెన్నాయుడు అన్నారు. వారు ఐదుగురే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మిగిలిన మంత్రులు అందరూ పేరుకే మంత్రులని అన్నారు.
అప్పులు తీసుకువచ్చి బటన్ నొక్కి సంక్షేమ పధకాలకు నిధులు విడుదల చేయాలంటే దానికి ముఖ్యమంత్రే అవసరం లేదని, ఓ ఉద్యోగిని పెట్టుకొన్నా సరిపోతుందని అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ నగరానికి నిత్యం పారిశ్రామికవేత్తలు వస్తుండేవారని, కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్క పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రంలో కాలు పెట్టలేదంటే పరిపాలన ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చునని అచ్చెన్నాయుడు అన్నారు.
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను రప్పించాల్సిన సిఎం జగన్మోహన్ రెడ్డి, అప్పుల కోసం ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఓ వైపు విద్యుత్ ఛార్జీలు పెంచేసి మరోవైపు విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజలను హింసిస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు.
జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే కేవలం మూడేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని విదాల భ్రష్టు పట్టించేశారని, రాష్ట్రాన్ని గాడిన పెట్టుకోవడానికి చాలా శ్రమించవలసి ఉంటుందని అన్నారు. ఈ అరాచకపాలనకు ముగింపు పలకాల్సిన సమయం దగ్గర పడిందని అచ్చెన్నాయుడు అన్నారు.



