నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ఈరోజు మధ్యాహ్నం అన్‌స్టాపబుల్ సీజన్-2 ప్రసారమయ్యింది. మొదటి ఎపిసోడ్‌లోనే బాలయ్య తన బావగారు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, తన అల్లుడి నారా లోకేష్‌ని బోనులో నిలబెట్టి వారి నిజయతీ నిరూపించుకొనేలా చేయడం విశేషం.
ఆనాడు ఎన్టీఆర్ చేతిలో నుండి చంద్రబాబు నాయుడు టిడిపి పగ్గాలను తీసుకొన్నప్పటి నుంచి ప్రతిపక్షాలు దానికి ‘వెన్నుపోటు’ అనే ముద్ర వేసి ఆయనను మానసికంగా వేదిస్తూ పైశాచిక ఆనందం అనుభవిస్తోంది. ఇన్నేళ్ళుగా చంద్రబాబు నాయుడు ఆ టార్చర్ మౌనంగా భరిస్తూనే ఉన్నారు తప్ప ఏనాడు జరిగిన వాస్తవం ఇదీ అని గట్టిగా చెప్పేందుకు ప్రయత్నించలేదు. ఎందుకంటే తాను తప్పు చేయలేదని నంద్దమూరి కుటుంభాసభ్యులు కూడా గట్టిగా నమ్ముతున్నందునే! లేకుంటే ఆనాడే వారు ఆయనను వేలెత్తి చూపేవారు కదా!
అయితే ఆ వాస్తవాన్ని తన బావమరిది సాక్షిగా నేడు అన్‌స్టాపబుల్ సీజన్-2లో బయటపెట్టడం ద్వారా ప్రజలు కూడా గ్రహించేలా చేయగలిగారు. ఆరోజు అంటే 1995లో ఎన్నికల తర్వాత పార్టీలో జరిగిన తిరుగుబాటు గురించి బాలకృష్ణ ద్వారా ప్రజలకు చంద్రబాబు నాయుడు వివరిస్తూ, “ఆరోజు ఏం జరిగిందో నీకు, హరికృష్ణ ఇద్దరికీ తెలుసు. మన కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడటంతో ఆ ప్రభావం పార్టీపై కూడా పడింది. అప్పుడు మనం ముగ్గురం కలిసి పెద్దాయన దగ్గరకి వెళ్ళాము. ఆ సమయంలో ఆయన పక్కన బీవీ మోహన్ రెడ్డి ఉన్నారు. అప్పుడు పెద్దాయన మనల్ని చూసి దేని గురించి వచ్చారని అడిగితే మనం పార్టీ వ్యవహారం గురించి అని చెప్పాము. అప్పుడు ఆయన మీ ఇద్దరినీ బయట ఉండమని చెప్పి నాతో సుమారు మూడు గంటలు మాట్లాడారు. ఆ విషయం మీకు తెలుసు.
ఆరోజు ఆయనతో ఒకటే చెప్పాను. ఒక్కసారి పార్టీ సమావేశం ఏర్పాటు చేయండి అన్ని సమస్యలు తప్పక పరిష్కారం అయిపోతాయని దాదాపు కాళ్ళు పట్టుకొని వేడుకొన్నాను. రామాంజనేయ యుద్ధంలో శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడు విధిలేని పరిస్థితిలో శ్రీరాములవారితోనే యుద్ధం చేసినట్లుంది ఆ రోజు నా పరిస్థితి. కానీ ఆయన వినలేదు. కనుక విధిలేని పరిస్థితిలో నేను ఆ నిర్ణయం (టిడిపి పగ్గాలు చేతిలోకి తీసుకోవడం) తీసుకోవలసి వచ్చింది. అది తప్పా?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించగా, బాలయ్యబాబు స్పందిస్తూ, “ఆయన ఇష్టాన్ని మనం ఏనాడూ కాదనలేదు… అప్పుడు ఆయన మరో వ్యక్తి ప్రభావంలో ఉన్నందున ఆయనలోని నాయకుడిని వ్యక్తిగత భావోద్వేగాలు డామినేట్ చేశాయి కనుకనే ఆనాడు ఆవిదంగా జరిగిపోయింది. ఇందులో మీ తప్పేమీ లేదు,” అని అన్నారు.
ఒక తండ్రి (ఎన్టీఆర్) గురించి ఆయనను ఎంతగానో అభిమానించే కొడుకు (బాలకృష్ణ) ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు తప్పు ఏమీ లేదని కోట్లాదిమంది ప్రేక్షకుల సమక్షంలో కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెపుతుంటే ఇంకా అనుమానించేవారిని శాడిస్ట్‌లనే అనుకోవలసి ఉంటుంది. ఈ నిజాన్ని లోకానికి చాటి చెప్పేందుకు బావా, బావామరుదులు ఇటువంటి చక్కటి వేదికను ఎంచుకోవడం వారి విజ్ఞతకు నిదర్శనంగా భావించవచ్చు.



