నెల్లూరు వైసీపీలో అంటుకొన్న మంటలు ఆర్పుకొనేసరికి, ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డి పొగలు సెగలు గక్కుతున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనను చల్లబరచడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన మాత్రం ఇంకా చల్లబడటం లేదు. అందుకు కారణం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలులో రాజకీయాలు చేస్తుండటమే అని బాలినేని చాలా స్పష్టంగానే చెపుతున్నారు.
కనుక ఒకవేళ పార్టీకి బాలినేని అవసరమని జగన్ భావిస్తున్నట్లయితే, ముందుగా సుబ్బారెడ్డిని నియంత్రించి ఉండాలి. కానీ సుబ్బారెడ్డికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు! అందుకే బాలినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైవీ సుబ్బారెడ్డికి ప్రాధాన్యం ఇచ్చుకొంటే ఇచ్చుకోవచ్చు అందుకు తనకు అభ్యంతరమేమీ లేదు కానీ ఆయన తన ఒంగోలు నియోజకవర్గంలో జోక్యం చేసుకొంటే సహించబోనని బాలినేని చాలా స్పష్టంగా చెపుతున్నారు. అయినా సుబ్బారెడ్డి ఒంగోలు రాజకీయాలలో వేలు పెట్టడం మానుకోవడం లేదు అంటే అర్దం ఏమిటి?
ఇటీవల ‘బుజ్జగింపు ఎపిసోడ్’ తర్వాత కూడా బాలినేని ధిక్కారస్వరాన్ని వినిపించారు. ఇంకా వినిపిస్తూనే ఉన్నారు. నిన్న ఆయన ఒంగోలులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, “నేను నావాళ్ళని అనుకొన్నవాళ్ళే నన్ను వెన్నుపోటు పొడవాలని ప్రయత్నిస్తున్నారు. నేను పార్టీ వీడుతానని, వచ్చే ఎన్నికలలో ఒంగోలు నుంచి కాకుండా దర్శి, మార్కాపురం, గిద్దలూరులో ఏదో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. నా గురించి నియోజకవర్గంలో చాలా చెడుగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధిష్టానానికి పిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటివారినా… ఇంతకాలం నమ్మానని ఇప్పుడు బాధపడుతున్నాను.
ఈ సందర్భంగా అందరికీ కొన్ని విషయాలు చెప్పదలచుకొన్నాను. నేను పార్టీ వీడటం లేదు. అలాగే ఒంగోలు వీడటం లేదు. ఇకపై నాకు అండగా నిలుస్తున్న పార్టీ కార్యకర్తలను, సిఎం జగన్మోహన్ రెడ్డిని తప్ప పార్టీలో మరెవరినీ ఖాతరు చేయను. నాకు నా కార్యకర్తలే ముఖ్యం. కార్యకర్తలను కాపాడుకోవాలని నేను అధినేత జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను.
జగన్ బటన్ నొక్కి ప్రజలకు బాగానే సేవ చేస్తున్నారు. నేను నా నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తున్నాను. నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తునే ఉన్నాను. అందుకే ప్రజలు నన్ను 5సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇంత ఆదరణ చూపుతున్న ఒంగోలు ప్రజలను కాదని నేను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఏమిటి? వచ్చే ఎన్నికలలో కూడా నేను మళ్ళీ ఒంగోలు నుంచే పోటీ చేసి గెలుస్తాను,” అని అన్నారు.
ఈ సమావేశంలో బాలినేని పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలని జగన్‌కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం గమనార్హం. తనను ఇలాగే ఇబ్బంది పెడుతుంటే కార్యకర్తలు ‘హర్ట్’ అవుతున్నారని, వారు ‘హర్ట్’ అయితే తాను’హర్ట్’ అయిన్నట్లేనని, అప్పుడు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందని బాలినేని సున్నితంగా తమ అధినేత జగన్‌ను హెచ్చరించిన్నట్లు భావించవచ్చు.
వచ్చే ఎన్నికలలో తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని కూడా చెప్పేశారు కనుక ఇకపై ఒంగోలువైపు పార్టీలో ఎవరూ చూడకుండా కట్టడి చేయాలని సూచించిన్నట్లు భావించవచ్చు. మరి బాలినేని హెచ్చరికలకు సిఎం జగన్ ఏవిదంగా స్పందిస్తారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.



