వైసీపిలో జగనన్న భజన చేసుకునేవారు, పార్టీని వీడినవారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కానీ ఒంగోలు, మైలవరం వైసీపి ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస రెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్, నర్సారావుపేట ఎంపీ రఘురామ కృష్ణరాజు ముగ్గురూ పార్టీలోనే ఉంటూ అధినేత జగన్‌కు చుక్కలు చూపిస్తున్నారు.
ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ చేతికి చిక్కడు దొరకడు. ఢిల్లీలో ఉంటూ మా అధినేత జగన్ అవినీతిపరుడు, ఇన్ని తప్పులు చేస్తున్నాడు… అంటూ చేస్తున్న విమర్శలు, ఆరోపణలతో జగన్ ప్రతిష్ట మసకబారుతోంది. పైగా ఖాళీగా కూర్చోకుండా హైకోర్టు, సుప్రీంకోర్టులో జగన్, ఆయన ప్రభుత్వం మీద ఏవో కేసులు తగిలిస్తూ ముప్పతిప్పలు పెడుతూనే ఉన్నారు.
ఇక ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం వైసీపిలో ‘టామ్ అండ్ జెర్రీ షో’లా నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. మూడు రోజుల క్రితం జగనన్నతో కలిసి నడిచేందుకు నేను కూడా ‘సిద్దం’ అంటూ ట్వీట్ చేసిన బాలినేని, మళ్ళీ అలిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని కూర్చున్నారు.
ఆయన అలకకు కారణం ఒంగోలు ఎంపీ సీటుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఖరారు చేయడమే. ఆయనతో ఇక వేగడం కష్టమని జగన్ భావిస్తుంటే, తన మాటకు విలువలేనప్పుడు వైసీపిలో కొనసాగడం అనవసరం అని బాలినేని అనుకుంటున్నారు. కనుక వైసీపిలో ఈ బాలినేని షో త్వరలోనే ముగియవచ్చు.
వైసీపి మైలవరం వసంత కృష్ణప్రసాద్ ఇదివరకు ఓసారి పార్టీ, నేతల తీరుని తప్పు పడుతూ “గూండాలను వెంటబెట్టుకొని రోడ్లపై కర్రలు, కత్తులు పట్టుకొని తిరుగుతూ ప్రజలని, ప్రతిపక్ష నేతలను భయపెట్టాలి… కానీ నేను అలా చేయలేక పార్టీలో, ప్రభుత్వంలో అసమర్ధుడుగా మిగిలిపోయాను,” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
తాజాగా ఆదివారం ఏలూరులో జరుగబోయే సిద్దం సభకు దూరంగా ఉంటానని, సభకు జనసమీకరణ కూడా చేయదలచుకోలేదని స్పష్టం చెప్పేశారు. దీంతో కొత్తగా పార్టీలో చేరి విజయవాడ ఎంపీ టికెట్ సంపాదించుకున్న ఎంపీ కేశినేని నాని ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు.
వైసీపి నేత పడమటి సురేష్ బాబుతో కలిసి మైలవరంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో సమావేశమయ్యారి. సిద్దం సభకు వసంత కృష్ణప్రసాద్ అనుచరులతో సహా పార్టీ కార్యకర్తలు, భారీగా జనసమీకరణ చేసే బాధ్యతలను వారికి అప్పగించారు. ఈ నేపధ్యంలో వసంత కృష్ణప్రసాద్ త్వరలో పార్టీని వీడే అవకాశం కనిపిస్తోంది.
వీరందరూ ఒక ఎత్తు అయితే వైఎస్ షర్మిల ఒక్కరూ ఒక ఎత్తు. ఆమె ‘జగనన్న… జగనన్న… అంటూ అన్నపై చేస్తున్న వ్యక్తిగత, రాజకీయ విమర్శలు, ఆరోపణలకు వైసీపి సమాధానాలు చెప్పుకోలేక విలవిలలాడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ళు పూల నావలా సాగిపోయిన జగన్మోహన్ రెడ్డికి, ఎన్నికలకు ముందు ఈ కష్టాలు ఏమిటో… పార్టీలో ఇంతమంది విభీషణులు, శిఖండిలు పుట్టుకొస్తున్నారేమిటో పాపం!




