బనకచర్ల: తెలంగాణ పార్టీలు అడ్డుకోగలిగాయి కానీ..

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు బనకచర్ల ప్రాజెక్టుపై తమ తమ రాజకీయ ప్రయోజనాలు, అవసరాల కోసమే అయినా పోరాటాలు చేశాయి. ఆ కారణంగా ఈ ప్రాజెక్టుపై కేంద్రం వెనకడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం దీనికి అనుమతి కోరుతూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకి దరఖాస్తు పంపగా, ముందు దానితో ముడిపడున్న ఇతర సాంకేతిక అంశాలు, సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని తిప్పి పంపింది.

ఈ ప్రాజెక్టు గురించి సిఎం చంద్రబాబు నాయుడు ఒక్కరే గట్టిగా మాట్లాడారు తప్పితే ఇంత వరకు కూడా జగన్‌ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. జగన్‌కి తన పరామర్శయాత్రలు, తమ కేసులు, సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించడంపై ఉన్న శ్రద్ద బనకచర్ల ప్రాజెక్టుపై లేనే లేదు. ఎందుకంటే, ఐదేళ్ళు ముఖ్యమంత్రి పాలించినా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గురించి అవగాహన లేని జగన్‌కు, సిఎం చంద్రబాబు నాయుడు నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు గురించి ఏం అవగాహన ఉంటుంది?

ADVERTISEMENT

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబందం, ఈ ప్రాజెక్టు వలన చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి ప్రజలలో మంచి పేరు వస్తుందని, జాతీయ రాజకీయాలలో ఆయన పలుకుబడి పెరుగుతుందనే జగన్‌ దీనిపై మౌనం వహించినట్లు భావించవచ్చు. ఈ ప్రాజెక్టుని సమర్ధించకపోయినా కనీసం దీనిని వ్యతిరేకిస్తూ తెలంగాణలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు చేస్తున్న వాదనలను ఖండించలేదు.

బిఆర్ఎస్ పార్టీ ఏ ఉద్దేశ్యంతో దీనిపై పోరాడినప్పటికీ దాంతో అది అధికార కాంగ్రెస్ పార్టీపై కూడా ఒత్తిడి తేగలిగిందని, ఈ ప్రాజెక్టుని అడ్డుకోగలిగిందని స్పష్టమయ్యింది.

ఈ ప్రాజెక్టు వలన తెలంగాణకు ఎటువంటి నష్టమూ కలగదని కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలకు తెలిసి ఉన్నప్పటికీ తమతమ రాజకీయ ప్రయోజనాల కోసం పోరాటాలు చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేగలిగాయి.

కానీ అంత మాత్రాన్న ఈ ప్రాజెక్టుని కేంద్రం తిరస్కరించిందని కాదు.. ఆటకెక్కిపోయిందని కాదు. కేంద్రం సూచనల మేరకు కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టి మళ్ళీ అనుమతి కోరడం ఖాయమే. ఒకవిదంగా ఇదీ మన మంచికే అనుకోవచ్చు.

ఈ ప్రాజెక్టు రాత్రికి రాత్రి నిర్మించగలిగేది కాదు. కనుక కాస్త ఆలస్యమైనా దీంతో ముడిపడున్న సమస్యలన్నీ పరిష్కరించుకొని ముందుకు సాగవచ్చు.

కానీ ఈసారి సిఎం చంద్రబాబు నాయుడు దీనికి కేంద్రం అనుమతి సాధించగలిగితే, జగన్‌ సహకరించకపోయినా, తెలంగాణలో పార్టీలు అడ్డుకున్నా సాధించిన ఘనత ఆయనకి, కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది.

ఒకవేళ కేంద్రం ఇప్పుడే దీనికి అనుమతిస్తే సిఎం చంద్రబాబు నాయుడు పరపతి పెరుగుతుంది కానీ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి కూడా ఇది అనుకూలంగా మారుతుంది. ప్రస్తుతం అది తమ పోరాటాలతోనే ఈ ప్రాజెక్టుని అడ్డుకున్నామని చెప్పుకోగలదు.

కానీ ఈ ప్రాజెక్టుకి ఇప్పుడే కేంద్రం అనుమతిస్తే ప్రధాని మోడీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముగ్గురూ కలిసి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారంటూ దుష్ప్రచారం మొదలుపెడుతుంది.

కనుక బనకచర్ల ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం పద్దతి ప్రకారం ముందుకు సాగడమే మంచిది. పనిలో పనిగా దీనిపై వైసీపీ వైఖరిని ప్రజలకు తెలియజేయడం కూడా చాలా అవసరమే.

ADVERTISEMENT
Latest Stories