కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న ‘భరత్ అనే నేను’ సినిమా మొదటి పాట విడుదలకు రంగం సిద్ధమైంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు భరతుడి మొదటి గేయం ప్రేక్షకులను పలకరించబోతోంది. దీనిని ధృవీకరిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది. మహేష్ బాబు బెస్ట్ లుక్స్ అన్నీ ఈ సినిమా కోసమే దాచిపెట్టినట్లుగా ఒక్కో పోస్టర్ రిలీజ్ అవుతుంటే, అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
ఏప్రిల్ 7వ తేదీన ఆడియో రిలీజ్ కు ముహూర్తం పెట్టగా, ఈ లోపు మరో పాటను కూడా విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ముందుగా ఈ వేడుకను విశాఖలో నిర్వహించాలని భావించినప్పటికీ, ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో వెన్యూ మారవచ్చని తెలుస్తోంది. చిత్ర యూనిట్ మాత్రం ఆడియో రిలీజ్ కు సంబంధించి ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. వెన్యూ మారినప్పటికీ, ఫుల్ ఆడియో మాత్రం ఏప్రిల్ 7నే రాబోతోందని ట్రేడ్ వర్గాల సమాచారం.



