విజయవాడ సమీపంలో కృష్ణానది మధ్య పర్యాటక ప్రాంతంగా ఉన్న భవానీ ఐలాండ్ లో ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మంత్రి అయిన భూమా అఖిల ప్రియ రాక గురించి సమాచారం ముందుగా తెలియకపోవడంతో అధికారులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. బరంపార్క్ నుంచి ప్రత్యేక బోటులో భవానీ ఐలాండ్ కు చేరుకున్న ఆమె, పర్యాటకులకు అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఆపై అధికారులతో మరింత మందిని ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలపై సమీక్ష జరిపారు.
ఈ సంఘటనతో అధికారులంతా అవాక్కు కాగా, మరో వైపు తన తండ్రి భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తారని ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ మరోసారి స్పష్టం చేయడంతో రాజకీయ వాతావరణం వేడేక్కింది. శిల్పా మోహన్ రెడ్డి తన సోదరుడితో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ అయి నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా తననే పోటీకి దింపాలని కోరారు. అలాగే మంత్రి అఖిల ప్రియ కూడా చంద్రబాబు వద్దకు వెళ్లి భేటీ అయ్యారు. దీంతో నంద్యాల ఉపఎన్నికపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.



