బీహార్ శాసనసభ ఎన్నికలలో 243 సీట్లకు బీజేపి, జేడీయూ కలిసి 202 సీట్లు గెలుచుకున్నాయి. వాటిలో బీజేపికి 89, జేడీయూకి 85 సీట్లు వచ్చాయి. బీహార్ చరిత్రలో ఇదొక సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి. ఇదేవిదంగా తర్వాత పశ్చిమ బెంగాల్‌లో కూడా ఘన విజయం సాధిస్తామని ఆ పార్టీ పెద్దలు చెపుతున్నారు.
బీహార్‌లో ఇంత ఘన విజయం సాధించిన బీజేపి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎందుకు బోర్లా పడింది? అని ప్రశ్నించారు. ఎవరో కాదు… ఘోషామహల్ బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్!
కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ ముగ్గురూ కలిసి తెలంగాణలో బీజేపిని భ్రష్టు పట్టించేస్తున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఉప ఎన్నికలోనే గెలవలేకపోతే రేపు జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపి ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు.
అయన బీజేపికి రాజీనామా చేసినప్పటికీ తాను ఇంకా బీజేపిలో ఉన్నట్లుగానే భావిస్తున్నారు. అది అప్రస్తుతం. కానీ తెలంగాణ బీజేపి పరిస్థితి గురించి అయన అడిగిన ప్రశ్నలకు బీజేపి అధిష్టానమే ఆలోచించాల్సి ఉంటుంది.
బీజేపి అధిష్టానానికి బీహార్ రాజకీయాలపై స్పష్టత ఉంది. ఆసక్తి ఉంది. కనుక దృష్టి పట్టి పనిచేసింది. గెలిచింది. అలాగే ఏపీ రాజకీయాలపై కూడా పూర్తి స్పష్టత ఉంది.
ఇదివరకు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుని, టీడీపి సీనియర్ నేతలని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నా బీజేపి అధిష్టానం కలుగజేసుకోలేదు. కారణాలు అందరికీ తెలుసు.
అలాగే జగన్ మూడు రాజధానులు, విశాఖ రాజధాని, సంక్షేమ పధకాల కోసం లక్షల కోట్లు ఎడాపెడా అప్పులు చేస్తున్నా ఆయనకు సహకరించిందే తప్ప అడ్డుకోలేదు. అప్పటికి టీడీపిని, చంద్రబాబు నాయుడుని శత్రువుగా పరిగణిస్తోంది. కనుక ఏపీలో వైసీపీ బలంగా ఉండటం అవసరమని భావించి ఉండవచ్చు.
కానీ చంద్రబాబు నాయుడు ఓ మెట్టు దిగి స్వయంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి, బీజేపితో మళ్ళీ పొత్తుకు సిద్దపడటంతో వారు కూడా తమ వైఖరి మార్చుకొని, జగన్‌ని గద్దె దించారు.
అప్పటి నుంచి మోడీ-చంద్రబాబు నాయుడు, మోడీ-నారా లోకేష్, మోడీ-పవన్ కళ్యాణ్‌ల మద్య బంధం చాలా బలపడింది. కనుక మూడు పార్టీలు కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నాయి.
ఏపీ, బీహార్ రాజకీయాలలో ఇంత స్పష్టత ఉన్న బీజేపి అధిష్టానానికి, తెలంగాణ రాజకీయాలలో మాత్రం అగమ్యగోచరంగా సాగుతున్నట్లే ఉంది.
గత ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించేసుకొని గొప్ప విజయావకాశాన్ని చేజార్చుకుంది.
అది కేసీఆర్ కోసమేనని కొందరు, తద్వారా కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకేనని మరికొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపి, బీఆర్ఎస్ పార్టీలే ఓడిపోయాయి.
బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా కేసీఆర్‌ని రాజకీయంగా దెబ్బ తీయడానికి సిఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్ కేసులనే దివ్యాస్త్రాలు అందించారు. కేంద్రం తలుచుకుంటే సీబీఐని పురమాయించి కేసీఆర్ అండ్ కోని లోపల వేసేయొచ్చు.
కానీ కిషన్ రెడ్డి సైంధవుడులా అడ్డుపడుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తూనే ఉన్నారు. సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదనే రేవంత్ రెడ్డి ప్రశ్నకు ఎవరూ జవాబు చెప్పడం లేదు.
కనుక బీజేపి అధిష్టానం కేసీఆర్‌ని మళ్ళీ అధికారంలోకి తీసుకు రావాలనుకుంటోందా? అందుకే కాపాడుతోందా?అనే సందేహాలు కలుగుతాయి.
కానీ కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీని అడ్డు తొలగించుకుంటే నేరుగా కాంగ్రెస్ పార్టీతో తలపడి అవలీలగా తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండగా, కేసీఆర్‌ని ఎందుకు కాపాడుతోంది?అంటే రాజాసింగ్ చెపుతున్నట్లు బీజేపి అధిష్టానానికి తెలంగాణపై ఆసక్తి లేదనుకోవాలేమో?






