తమకు తిరుగేలేదు.. ఎదురు లేదనుకున్న ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో ఘోర పరాభవం ఎదురైంది. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ 54 ఓట్ల తేడాతో తిరస్కరించబడింది.
లోక్‌సభకు హాజరైన 528లో 2/3 వంతు మంది అంటే 352 మంది మద్దతు అవసరం కాగా 298 మంది మాత్రమే అనుకూలంగా ఓట్లు వేశారు. మిగిలిన 230 మంది ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
కనుక చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ 2023లో చేసిన చట్టానికి సవరణ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకి, లోక్‌సభలో 2/3 వంతు మంది మద్దతు లభించనందున 54 ఓట్ల తేడాతో తిరస్కరించబడిందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
డీలిమిటేషన్ బిల్లుని ఈ బిల్లుతో ముడి పెట్టవద్దని, ముడిపెట్టకపోతే మద్దతు ఇస్తామని విపక్షాల సూచనని ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా ముందుకు సాగడం వల్లనే లోక్‌సభలో అనూహ్యంగా ఈ పరాభవం ఎదురైంది.
ఓ పక్క దేశంలో జనగణన కార్యక్రమం మొదలైనప్పుడు, అది పూర్తి చేసి ఆ గణాంకాలు ఆధారంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ ఖరారు చేయాలని విపక్షాల వాదన సహేతుకంగానే ఉంది.
కానీ 2011లో అంటే 15 ఏళ్ళ క్రితం జన గణన గణాంకాల ప్రకారం ఈ బిల్లుని అమలు చేయాలనుకుంది ఎన్డీయే ప్రభుత్వం.
పైగా దీనిని డీలిమిటేషన్ బిల్లుతో ముడి పెట్టి ప్రతిపక్షాలు వీటిని వ్యతిరేకించలేని పరిస్థితి కల్పించి ఆమోదముద్ర వేయించుకోవాలనుకుంది.
కానీ ప్రతిపక్షాలు ఒక్కటిగా నిలిచి ధైర్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించాయి. దీంతో ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో పరాభవం తప్పలేదు.
మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరించబడినందున దాంతో ముడిపెట్టిన డీలిమిటేషన్ బిల్లును, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబందించిన బిల్లుని కూడా వెనక్కు తీసుకుంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కిరణ్ రిజిజూ స్పీకర్‌కు తెలియజేశారు.
లోక్‌సభలో తొలిసారిగా ఎన్డీయేని నిలువరించినందుకు కాంగ్రెస్ మిత్రపక్షాలు, ముఖ్యంగా ఈ నెల 23న శాసనసభ ఎన్నికలకు వెళుతున్న బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీలు చాలా సంతోషంగా ఉన్నాయి.
లోక్‌సభలో ఇటువంటి పరాభవాన్ని ఎన్డీయే ప్రభుత్వం ఊహించలేదు. కనుక ఈరోజు ఉదయం 11 గంటలకు మళ్ళీ పార్లమెంటు సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహం సిద్ధం చేసుకుంటోంది.
చట్ట సభలలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలనే తమ ప్రయత్నాన్ని కాంగ్రెస్, మిత్ర పక్షాలు అడ్డుకోవడం చాలా దుర్మార్గమని నిన్ననే వాదించారు. కనుక నేడు అదే వాదనకు మరింత పదునుపెట్టి ఎదురుదాడి చేయడం ఖాయం.
లోక్‌సభలో ఎన్డీయేని నిలువరించిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ మిత్ర పక్షాలు కూడా దానిని మరింత దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాయి.
కనుక నేడు లోక్‌సభలో రణరంగం తప్పదు. దాని పరిణామాలు ఎన్నికలపై ఏమైనా ప్రభావం చూపగలవా లేదా? అనేదే ముఖ్యం.




