బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ.?

Narendra Modi and Amit Shah during discussions about BJP’s political expansion plans in Telangana after West Bengal victory

కాషాయ భారతం అనే విధంగా బీజేపీ ఒక్కో రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ రాజకీయంగా దేశంలో అశ్వమేధ యాగం చేస్తుందా అన్నట్టుగా ముందుకు సాగుతుంది. అయితే గత దశాబ్దం పాటు పశ్చిమ బెంగాల్ లో మమత పై రాజకీయ పోరాటం చేస్తున్న బీజేపీ ఎట్టకేలకు ఈ ఎన్నికలలో అనుకున్న లక్ష్యాన్ని అందుకుంది.

దీదీ ని అధికార పీఠం నుంచి కిందకి దింపి వెస్ట్ బెంగాల్ లో కాషాయ జెండా ఎగరేశారు బీజేపీ నేతలు. మోడీ – షా జోడి బీజేపీ ని దేశంలోనే ఎదురులేని రాజకీయ శక్తిగా మారుస్తుంది. నిన్నటి వరకు వెస్ట్ బెంగాల్ లో అందని ద్రాక్ష ల ఉన్న అధికారం ఇప్పుడు చేతికి రావడంతో ఇక బీజేపీ తన నెక్స్ట్ టార్గెట్ ను వెతికే పనిలో పడిందా అన్న చర్చ మొదలయ్యింది.

ADVERTISEMENT

అయితే మోడీ – షా నెక్స్ట్ గురి తెలంగాణ కాబోతుంది అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. తెలంగాణలో అధికార పీఠం కోసం బీజేపీ కొన్నేళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్ష బిఆర్ఎస్ కూడా అనుకున్న స్థాయిలో రాజకీయం చేయలేకపోతోంది.

కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం కావడం, కవిత తెరాస తో బిఆర్ఎస్ కు పక్కలో బళ్ళెంలా మారడం, కాళేశ్వరం, ఈ ఫార్ములా రేసింగ్, ఫోన్ టాపింగ్ కేసులు కేసీఆర్, హరీష్, కేటీఆర్ కి ముందర కాళ్ళకు బంధాలుగా మారడం బిఆర్ఎస్ ను రాజకీయంగా స్తబ్దుగా మారుస్తున్నాయి.

ఇక అటు అధికార కాంగ్రెస్ సైతం హైడ్రా అంటూ పేద ప్రజల ఆగ్రహానికి గురి కావడం, ఎన్నికల హామీల విషయంలో ఇప్పటికి కాంగ్రెస్ తడబాటు పడడం వంటి వాటితో పాటుగా ప్రభుత్వ వ్యతిరేకతను కూడా బీజేపీ తనకు అనుకూలంగా మలచుకోగలిగితే రాబోయే ఎన్నికలలో బీజేపీ కనీసం రెండవ స్థానంలోకైనా రాగలుగుతుంది.

అయితే బీజేపీ అటు అధికార కాంగ్రెస్ ని ఇటు ప్రతిపక్ష బిఆర్ఎస్ ను వెనక్కి నెట్టి ముందుకు రావాలి అంటే ముందుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం క్షేత్ర స్థాయిలో బలంగా పనిచేయగలగాలి. ప్రజా పోరాటాలు నిర్వహించాలి, చాల దూకుడుగా రాజకీయాలు చేస్తూ తెలంగాణ లో బీజేపీ కూడా చాల బలంగా ఉంది అనే సంకేతాలు అటు ప్రజలతో పాటుగా రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా కలిగించగలగాలి.

టి. బీజేపీ లో పార్టీ గొంతు వినిపించే నేతలు బలంగా ఉన్నప్పటికీ వారిలో ఐక్యత కొరవడింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి కేంద్ర మంత్రులు తెలంగాణ ఎంపీ లుగా ఉన్నప్పటికీ టి.బీజేపీ ఇంకా తెలంగాణలో రాజకీయంగా తడబాటును ఎదుర్కొంటూనే ఉంది.

ఇక బిఆర్ఎస్ నుంచి బీజేపీ లో చేరిన ఈటెల తెలంగాణ రాజకీయాలలో కీలక నేత. అయినా అటువంటి సీనియర్ నాయకుడు, సొంత రాజకీయ ఇమేజ్ ఉన్న నేతను బీజేపీ అధిష్టానం మరుగునపడేసిందనే వాదన కూడా తెలంగాణ రాజకీయాలలో బలంగా వినిపిస్తుంది.

వీటన్నింటిని బీజేపీ అధిష్టానం సరిచేసుకుని ముందుకు వెళ్లగలిగితే తెలంగాణలో కూడా రాబోయే రోజులలో బీజేపీ జెండా ఎగరేసే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories