bjp-set-for-telangana-amit-shah-sparks-speculation

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో నిజామాబాద్‌ జిల్లాలో పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఏర్పడితే దాని వలన ప్రజలకు జరిగిన మేలు కంటే బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకే ఎక్కువ మేలు కలిగిందన్నారు. ఇదివరకు కేసీఆర్‌ హయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దోచుకుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోచుకుంటోందన్నారు.

Also Read – మిథున్ రెడ్డి స్వామిభక్తి ప్రదర్శిస్తే పరవాలేదు కానీ..

తెలంగాణని కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్‌ అధిష్టానం దోచుకుంటోందన్నారు. రెండు పార్టీలకు తెలంగాణ ఏటిఎంలా మారిందన్నారు.

తెలంగాణలో కూడా బీజేపి అధికారంలోకి వచ్చి ‘డబుల్ ఇంజన్ సర్కార్’ ఏర్పడినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెంది ఆ ఫలాలు ప్రజలకు అందుతాయని, వచ్చే ఎన్నికల్లో బీజేపి అధికారంలోకి రావడం తధ్యమని అమిత్ షా అన్నారు.

Also Read – జగన్‌ మెప్పుకంటే శతృత్వమే మేలు?

తెలంగాణలో బీజేపి అధికారంలోకి వస్తుందనే మాట ప్రధాని మోడీ, అమిత్ షాలు చాలాసార్లు చెప్పారు. కానీ అప్పుడు అందుకు అనుకూలమైన పరిస్థితి లేదు కనుక వారి మాటలు ‘రొటీన్ డైలాగ్’ అన్నట్లు ఎవరూ పట్టించుకునేవారు కారు.

కానీ ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ బలహీనపడి కేసులలో చిక్కుకొని ఉండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆర్ధిక పరిమితులు, కాంగ్రెస్‌ అధిష్టానం కర్ర పెత్తనం కారణంగా చేతులు కట్టేసినట్లయింది.

Also Read – రాజకీయ ప్రతీకారాల కోసమే ప్రజలెన్నుకోవాలా?

బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసే ఆలోచన చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత స్వయంగా బయటపెట్టారు. వచ్చే ఎన్నికలలో బీజేపికి మద్దతుగా టీడీపీ, జనసేనలు కూడా రావచ్చు.




కనుక ఈసారి కూడా అమిత్ షా యధాలాపంగా రొటీన్ డైలాగే చెప్పినప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఇదే రాజకీయ పరిస్థితులు నెలకొని ఉంటే తెలంగాణలో బీజేపి అధికారంలోకి రావడం ఖాయమనే భావించవచ్చు.