మహిళా రిజర్వేషన్స్ బిల్లుని లోక్‌సభ తిరస్కరించడంపై అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మద్య మరో కొత్త రాజకీయ యుద్ధాలు మొదలైపోయాయి.
ఈ బిల్లుతో దేశంలో మహిళలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు తాము ప్రయత్నిస్తే కాంగ్రెస్, మిత్ర పక్షాలు అడ్డుకొని మహిళలకు తీరని ద్రోహం చేశాయని బిజేపి నేతలు వాదిస్తున్నారు. ఇది పార్లమెంటు చరిత్రలో చీకటి రోజని వాదిస్తున్నారు.
విపక్షాలు మహిళలకు చేసిన ఈ అన్యాయంపై దేశ ప్రజలకు వివరిస్తామని బిజేపి నేతలు చెప్తున్నారు. చారిత్రికమైన ఈ బిల్లుని అడ్డుకున్నందుకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా ఎన్డీయే పార్టీలు నిరసనలు తెలియజేయాలని బిజేపి పిలుపునిచ్చింది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకా పలువురు విపక్ష నేతలు స్పందిస్తూ, “పార్లమెంటులో రాజమార్గంలో ఈ బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నప్పటికీ బిజేపి దొడ్డిదారిన దీనిని ప్రవేశపెట్టింది. దీని చాటున డీలిమిటేషన్ బిల్లుని ఆమోదింపజేసుకోవాలని దురాలోచన చేసింది.
డీలిమిటేషన్‌తో దేశ రాజకీయాలను తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకుంది. చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ అమలుచేయాలనే చిత్తశుద్ది కేంద్రానికి ఉండి ఉంటే ఈవిధంగా చేసి ఉండేది కాదు. మహిళా రిజర్వేషన్స్ బిల్లుని డీలిమిటేషన్‌తో ముడి పెట్టకుండా ప్రవేశపెడితే బేషరతుగా నూటికి నూరు శాతం మద్దతు ఇస్తామని చెపుతూనే ఉన్నాము. కానీ మోడీ ప్రభుత్వం మంద బలంతో బిల్లును పాస్ చేయించుకోవాలని ప్రయత్నించి భంగ పడింది.
ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విజయం. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన శుభ దినం,” అని అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ బిల్లుల తిరస్కరణపై ఎవరి వాదనలు వారికున్నాయని అర్ధమవుతోంది.
ఏప్రిల్ 23న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కాంగ్రెస్ మిత్ర పక్షాలు ఈ బిల్లుని తిరస్కరించి దేశంలో మహిళలకు అన్యాయం చేశాయంటూ బిజేపి ప్రచారం చేసుకోకుండా ఉండదు.
అలాగే కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా దక్షిణాది రాష్ట్రాలకు, మహిళలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయకుండా అడ్డుకున్నామని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొని ప్రజల లబ్ది పొందాలని ప్రయత్నించడం ఖాయం.
ఈవిధంగా ఒకే బిల్లుతో అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమికి కూడా సమానంగా రాజకీయ మైలేజ్ లభిస్తుండటం విచిత్రంగానే ఉంది కదా?




