కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడుగా పేరు సంపాదించుకున్న ముద్రగడ పద్మనాభం, ఆ పేరుని ఇప్పుడు తన కుటుంబానికి రాజకీయ లబ్ధి కలిగించేందుకు వాడుకోవాలని ప్రయత్నిస్తుండటం చూసి బహుశః కాపు సామాజిక వర్గం లోలోన బాధపడుతుండవచ్చు. ఈ ప్రయత్నంలో ఆయనే అభాసుపాలవుతున్నారు కూడా.
టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకుంటే కాపు ఓటర్లు అందరూ వాటివైపు వెళ్ళిపోతారనే ఆలోచనతో, వైసీపి ఆయనకు పెద్దాపురం టికెట్‌తో గాలం వేసింది. కానీ ఈసారి ఎన్నికలలో తాను పోటీ చేయలేనని కనుక ఆ టికెట్ తన కుమారుడుకి లేదా కోడలుకి ఇవ్వాలని కోరగా అందుకు జగన్ ఓకే చెప్పిన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన వైసీపిలో చేరడం ఖాయమే అని భావించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు.
జనవరి 1న తన నివాసంలో నూతన సంవత్సర వేడుకలకు కాపు నేతలను ఆహ్వానించి తాను వైసీపిలో చేరుతున్నానని, పెద్దాపురం టికెట్ ఖరారు అయ్యిందని ప్రకటించాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ముద్రగడ ప్రస్తావన చేయలేదు. టికెట్ ఖరారు చేస్తున్నట్లు చెప్పలేదు. దీంతో జగన్ తనకు హ్యాండ్ ఇచ్చారని ముద్రగడ భావిస్తున్నారు.
ముద్రగడ చేసిన విమర్శలను తిప్పికొట్టకుండా వాటిని ఆశీర్వదాలుగా స్వీకరిస్తున్నానని, ఆయన కోసం జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్పడం జనసేనకు ఇప్పుడు కలిసి వచ్చింది.
జనసేన నేతలు బొలిశెట్టి, తాతాజీ, కొందరు కాపు నేతలు బుధవారం రాత్రి కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు. వారికి ఆయన ఏమి సమాధానం చెప్పారో తెలీదు కానీ ఈరోజు ఉదయం టిడిపి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తదితరులు ఆయన నివాసానికి వెళ్ళి సుమారు అర్ద గంటసేపు సమావేశమయ్యారు. ఈసారి టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తున్నందున జనసేనలో చేరితే బాగుంటుందని, కానీ వైసీపిలో చేరి కాపు ఓట్లను చీల్చవద్దని నెహ్రూ ఆయనను అభ్యర్ధించిన్నట్లు తెలుస్తోంది.
ముద్రగడ టికెట్ కోసం కాపుజాతిని చీల్చి వైసీపికి సాయపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత నష్టం చేసినవారవుతారు. అదే టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జనసేనలో చేరి కాపులందరినీ ఒక్కతాటిపైకి తీసుకు రాగలిగితే ఆయన గౌరవం మరింత పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు కూడా ఎంతో మేలు చేసినవారవుతారు.
—




