టిడిపి సీనియర్ నేత బోండా ఉమామహేశ్వర రావు ఈరోజు వైసీపి ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేశారు. అయినకాడికి ప్రభుత్వాస్తులు, భూములు తాకట్టుపెట్టి అప్పులు తెస్తున్నా వైసీపి ప్రభుత్వం, టిడిపి హయాంలో పేదల కోసం నిర్మించిన 3.13 లక్షల టిడ్కో ఇళ్ళని కూడా బ్యాంకులలో తాకట్టు పెట్టి సుమారు రూ.10,000 కోట్లు అప్పు తీసుకొందని బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు.
ఇంతకాలం ఈ విషయం ఆ ఇళ్ళ లబ్ధిదారులకు తెలియకుండా వైసీపి ప్రభుత్వం రహస్యంగా దాచిపెట్టిందని బోండా ఉమా ఆరోపించారు. వైసీపి ప్రభుత్వం పేదల కోసం కొత్తగా ఒక్క ఇల్లు నిర్మించనప్పటికీ, టిడిపి ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళను కూడా బ్యాంకులో తాకట్టుపెట్టి అప్పుచేయడం దారుణమని బోండా ఉమా అన్నారు.
అయితే బ్యాంకులు వాటిని తాకట్టు పెట్టుకొని గుడ్డిగా అంత డబ్బు అప్పుగా ఇస్తాయా? అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. దానికీ బోండా ఉమాయే సమాధానం చెప్పారు.
టిడిపి హయాంలోనే దాదాపు నిర్మాణాలు పూర్తయిన ఇళ్ళన్నిటినీ లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇంతకాలం పాడుబెట్టి, ఇప్పుడు వాటికి మరమత్తులు చేయించేందుకు అంటూ వాటిపై అప్పు తీసుకొందని బోండా ఉమా ఆరోపించారు.
కానీ ఆ ఇళ్లకు వైసీపి రంగులు మాత్రమే వేయించి ‘మమ’ అనిపించేసి, మిగిలిన డబ్బుని జేబులు వేసుకొందని బోండా ఉమా ఆరోపించారు. ఆ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్లిపోయిందో చెప్పాలని బోండా ఉమా నిలదీశారు.
ఆ ఇళ్ళపై తీసుకొన్న బకాయిలను చెల్లించాలని బ్యాంకులు లబ్ధిదారులకు నోటీసులు పంపిస్తుండటంతో ఈ భాగోతం బయటపడిందని బోండా ఉమా చెప్పారు. ఒకవేళ లబ్ధిదారులు ఆ బకాయిలు చెల్లించకపోతే వారి ఇళ్ళను వేలం వేస్తామని, బకాయిలు చెల్లించకపోతే మరే బ్యాంకులలో కూడా వారికి ఏ అవసరాలకు రుణాలు లభించకుండా చేస్తామని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయని బోండా ఉమా చెప్పారు.
దీనికి వైసీపి ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుందని బోండా ఉమా నిలదీశారు. ఇకనైనా వైసీపి ప్రభుత్వం చేసిన తప్పును ఒప్పుకొని తక్షణం బ్యాంక్ రుణం తీర్చేసి లబ్ధిదారులకు ఈ వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.
టిడ్కో ఇళ్ళపై వైసీపి ప్రభుత్వం బ్యాంకుల నుంచి పదివేల కోట్లు తీసుకోవడమే నిజమైతే ఇది చాలా తీవ్రమైన విషయమే అవుతుంది. ఎందుకంటే వాటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాగా ఒక్కో ఇంటికీ సుమారు రూ.2-3 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కనుక కేంద్ర ప్రభుత్వానికి కూడా వైసీపి ప్రభుత్వం జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. ఇప్పటికే పంచాయితీలకు విడుదల చేస్తున్న నిధులను వైసీపి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పుడు టిడ్కో ఇళ్ళపై అప్పు చేయడం నిజమైతే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు.




