ఏపీ మంత్రికి తెలంగాణలో వైద్యం… ఇదేం ఖర్మ?

Botsa-Satyanarayana

ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె సబందిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించడంతో మెరుగైన చికిత్స కోసం ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో చేరారు. మెరుగైన వైద్యం కోసం రాజకీయ నాయకులు పొరుగు రాష్ట్రానికో, విదేశాలకో వెళ్ళడం సహజమే. కనుక మంత్రి బొత్స కూడా అలాగే వెళ్ళారని సరిపెట్టుకోవచ్చు.

ADVERTISEMENT

అయితే ఏపీలో విద్యా, వైద్య రంగాలను ఎంతగానో తమ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని మంత్రులు గొప్పలు చెప్పుకొంటున్నప్పుడు, మంత్రి బొత్స హైదరాబాద్‌ ఎందుకు వెళ్ళారు? అంటే అభివృద్ధి అబద్దమని స్పష్టం అవుతోంది.

తమ ప్రభుత్వం కరోనాను మహాద్భుతంగా కట్టడి చేసిందని మొన్ననే సజ్జల గొప్పగా చెప్పుకొన్నారు. అయితే ఆ సమయంలో ఏపీలో వైద్య సౌకర్యం లభించకపోవడంతో అనేకమంది రోగులు అంబులెన్సులలో హైదరాబాద్‌ బయలుదేరడం, తెలంగాణ సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకొని వెనక్కుతిప్పి పంపేయడం బహుశః ఆయనకు గుర్తురాలేదు. అప్పుడూ రోగులు, ఇప్పుడు మంత్రి బొత్స హైదరాబాద్‌కు ఎందుకు వెళుతున్నారంటే అక్కడ అత్యుత్తమైన హాస్పిటల్స్ ఉన్నందునే అని అర్దమవుతోంది.

కరోనా నుంచి తెలంగాణ ప్రభుత్వం చాలా గుణపాఠాలు నేర్చుకొని వెంటనే ఎక్కడికక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, వైద్య, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసుకొంది. అంతేకాదు…వైద్య రంగంలో భారీగా ఆదాయం వస్తుందని గ్రహించి ‘మెడికల్ టూరిజం’ని కూడా ప్రోత్సహిస్తోంది. దేశవిదేశాల నుంచి రోగులు హైదరాబాద్‌ వచ్చి వైద్య చికిత్సలు చేయించుకొని వెళుతున్నారు.

కానీ వైసీపి ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్ని హాస్పిటల్స్ నిర్మించింది?అనే ప్రశ్నకు హైదరాబాద్‌ వెళ్ళి చికిత్స చేయించుకొంటున్న వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలే సమాధానం చెప్పాలి.

మరో విషయం ఏమిటంటే చిన్న చిన్న శస్త్ర చికిత్సల కోసం ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ వెళుతున్నారు గనుకనే తెలంగాణ మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు కూడా. అయినా అందుకు ఏపీ మంత్రులు సిగ్గుపడినట్లు కనబడరు. కోడి… గుడ్డు… సామాజిక సాధికార యాత్రలంటూ రోజులు దొర్లించేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories