విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్టయిలే వేరు. అపార రాజకీయ అనుభవం కలిగిన ఆయన బహిరంగసభలలో ప్రసంగించేటప్పుడు ఏదో విషయంపై ఏదో మాట్లాడేసి వివాదంలో చిక్కుకొంటుంటారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్నప్పుడు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెపుతుంటే అటువంటిదేమీ జరుగలేదని బొత్సవారు అన్నారు. అమ్మఒడి పధకంలో 75 శాతం హాజరు షరతు విధించి డబ్బు చెల్లించకపోవడంపై స్పందిస్తూ, “మీరు మీ పిల్లలను బడికి పంపకపోతే మాదా బాధ్యత?”అని తల్లితండ్రులను ఎదురు ప్రశ్నించడంతో వారు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడితే పిల్లలను ఎక్కడికి పంపించాలి?అని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా విజయనగరం జిల్లా గరివిడిలో బుదవారం వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్సీ-1998లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్ధులు మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. వారిని ఉద్దేశ్యించి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, “మీకు వయసు పెరిగిపోయింది. ఒక్కొక్కళ్ళకి 45-50 ఏళ్ళు దాటిపోయాయి. ఇప్పుడు మీరు డీఎస్సీలో ఎంపికై వచ్చారు. మీరు చదువు చెప్పడం ఎప్పుడో మరిచిపోయారు. కనుక ఇప్పుడు మీరు ఈ వయసులో పిల్లలకు ఏమి పాఠాలు చెప్పగలరో నాకు అర్ధం కావడం లేదు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు కనుక మిమ్మల్ని కాదనలేము. మిమ్మల్ని ఏమి చేయాలో నా బుర్రకు అర్ధం కావడం లేదు. ఓ పని చేయండి. మీ అందరికీ మళ్ళీ టీచర్ ట్రైనింగ్ ఇప్పిస్తాను. వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని రండి. తరువాత పిల్లలకు పాఠాలు చెబుదురు గాని…” అన్నారు.
1998 డీఎస్సీకి ఎంపికైన అభ్యర్ధులకు ఇంత ఆలస్యంగా ఉద్యోగాలు రావడం వారి తప్పు కాదు. వారందరూ అప్పటి నుంచి ఈ ఉద్యోగాల కోసమే ఎదురుచూస్తూ ఇంట్లో ఖాళీగా కూర్చోరు. కూర్చోంటే ఇల్లు గడవదు కనుక ఏదో ఓ ప్రైవేట్ స్కూల్లోనో లేదా కార్పొరెస్ట్ స్కూళ్ళలోనో ఉపాధ్యాయులుగా పనిచేస్తూనే ఉంటారు. వారందరూ ఉపాధ్యాయవృత్తిని ఎంచుకొన్నారు కనుక వేరే వృత్తులలో చేసి ఉండకపోవచ్చు. అంటే 1998 నుంచి వారిలో చాలా మంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని స్పష్టమవుతోంది.
కనుక మంత్రి బొత్స సత్యనారాయణ వారితో వేరేగా సమావేశమయ్యి ముందుగా వారి అర్హతలు, అనుభవం గురించి అడిగి తెలుసుకొని అవసరమైన వారికి శిక్షణ ఇస్తామని చెప్పి ఉంటే హుందాగా ఉండేది. కానీ తనకు కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు వచ్చిన ఉపాధ్యాయ అభ్యర్ధులను ఉద్దేశ్యించి నలుగురిలో ఈవిదంగా కించపరుస్తూ మాట్లాడటం సరికాదనే చెప్పాలి.



