అలాగైతే తెలంగాణను మళ్ళీ ఏపీలో కలిపేస్తారా?

Botsa-Satyanarayana-Puvvada-Ajay-Kumar-ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య నీళ్ళ పంచాయితీలు ఎప్పుడూ సాగుతూనే ఉంటాయి. మద్యలో అక్కడ అధికార టిఆర్ఎస్‌, ఇక్కడ వైసీపీలకు రాజకీయ సమస్యలు లేదా తలనొప్పులు ఏవైనా ఏర్పడితే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూడా ఇరు రాష్ట్రాల మంత్రులు పరస్పరం ఏదో అంశంపై కత్తులు దూసుకొంటూ కీచులాడుకొంటున్నట్లు నటిస్తుంటారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పంపు హౌసులలో వందల కోట్లు చేసే మోటర్లు, విద్యుత్ పరికరాలు నీటమునగడంతో తెలంగాణలో ప్రతిపక్షాల నుంచి సిఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది.

ADVERTISEMENT

బహుశః ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు పోలవరం ఎత్తు తగ్గించాలని, ఖమ్మంలో ఏడు ముంపు మండలాలను, భద్రాచలం పక్కనే ఉన్న ఏపీకి చెందిన 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ద్వారా చెప్పించి ఉండవచ్చు.

వారు ఊహించినట్లే ఇటువైపు నుంచి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీటుగా స్పందిస్తూ, “రాష్ట్రవిభజనలో హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్ళిపోయింది. దాని వలన ఆంధ్రప్రదేశ్‌ భారీగా ఆదాయం కోల్పోయింది. కనుక హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయమని మేము అడిగితే కలిపేస్తారా?ఖమ్మంలో ముంపు సమస్యను మీరు పరిష్కరించుకోవాలి కానీ ఏపీలో విలీనం చేసిన మండలాలను తెలంగాణ విలీనం చేయమని కోరడం ఏమిటి? అంతగా కావాలనుకొంటే మళ్ళీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలిపేసుకొందాము. మీరు సిద్దమేనా?” అని సవాల్ విసిరారు.

తెలంగాణ ఏర్పడిందే సెంటిమెంటుతో కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇటువంటి వివాదాలతో దానిని రగిలించవచ్చు. అందుకు ఏపీ మంత్రులు కూడా ఈవిదంగా మాట్లాడి సహకరిస్తుంటారు కూడా. అదేవిదంగా ఏపీ ప్రజలు రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించినందున, ఆ అంశంపై మాట్లాడి మనవాళ్ళు ఇక్కడా సెంటిమెంట్ రాజేసి లబ్దిపొందే ప్రయత్నం చేస్తుండటం మామూలే! రాష్ట్రాలను పరిపాలించమని ప్రజలు అధికారం కట్టబెడితే తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు ఇరు రాష్ట్రాల మంత్రులు కీచులాడుకొంటున్నట్లు నటిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తుండటం చాలా దారుణం.

ADVERTISEMENT
Latest Stories