botsa-satyanarayana

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ రాజకీయాలలో అత్యంత సీనియర్ నాయకులలో ఒకరు. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు వైసీపి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న ఆయన పత్రికలో వచ్చిన వార్తని చూసి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ నెల 16వ తేదీ ఈనాడు పత్రికలో జగన్‌ హయాంలో విజయనగరం జిల్లాలో కొందరు వైసీపి నేతలు రూ.350 కోట్లు విలువైన భూములు కొట్టేశారని వార్త వచ్చింది.

Also Read – తండేల్ కాంబోస్..!

ఇటువంటి సందర్భాలలో రాజకీయ నాయకులు ఆ వార్తని ఖండిస్తున్నామనో లేదా నిరూపిస్తే ఆ భూములన్నీ ప్రభుత్వానికి అప్పగించేస్తామనో చెప్పి తప్పించుకుంటారు. కానీ బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, ఈ భూకబ్జాలపై లోతైన విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ వ్రాశారు. తద్వారా తాను, తన కుటుంబ సభ్యులే కాకుండా, ఉత్తరాంధ్రా జిల్లాలలో భూకబ్జాలకు పాల్పడిన వైసీపి నేతలందరినీ ఇరుకునపెట్టారని చెప్పవచ్చు.

యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు నారా లోకేష్‌, ఉత్తరాంధ్రా జిల్లాలలో వారాహి పర్యటన చేసినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ వైసీపి నేతల భూకబ్జాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. కానీ వాటిపై ప్రభుత్వం ఇంతవరకు విచారణ ప్రారంబించనే లేదు….అని గుర్తు చేస్తున్నట్లుంది ముఖ్యమంత్రికి బొత్స సత్యనారాయణ లేఖ వ్రాయడం.

Also Read – విశాఖ రైల్వే జోన్‌కి ఇన్ని తిప్పలా?

కేసీఆర్‌ హయాంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో భారీగా అవకతవకలు జరిగాయని తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ మంత్రులు వాదిస్తున్నప్పుడు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ “ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా?ఇంకా ఆలస్యం దేనికి?దమ్ముంటే విచారణ జరిపించండి” అని సవాలు విసిరారు.

ఆయన డిమాండ్ చేస్తున్నారు కనుక అంటూ సిఎం రేవంత్‌ రెడ్డి వెనత్నే కమీషన్‌ వేసి విచారణ జరిపిస్తున్నారు. ఆ వ్యవహారంలో కేసీఆర్‌కి, జగదీష్ రెడ్డికి విచారణకు హాజరుకమ్మని కమీషన్‌ నోటీస్‌ ఇస్తే, సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది!

Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?

వైసీపి నేతల భూకబ్జాలపై విచారణ జరిపించాలని బొత్స సిఎంకు లేఖ వ్రాశారు కనుక తప్పకుండా ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది.

విజయనగరం జిల్లా వైసీపిలో బొత్సకి గిట్టనివారు ఎవరైనా భూకబ్జాలకు పాల్పడి ఉంటే వారిని దెబ్బతీయడానికే విచారణ జరిపించాలని బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రికి లేఖ వ్రాశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.




ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో వైసీపి నేతలందరికీ బొత్స సత్యనారాయణే ఒక్క లేఖతో గొయ్యి తవ్వారని చెప్పక తప్పదు. వైసీపి నేతల భూకబ్జాలపై విచారణకు బొత్స సత్యనారాయణ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు కనుక ఇక కూటమి ప్రభుత్వానిదే ఆలస్యం! లేకుంటే బొత్స సత్యనారాయణ మళ్ళీ నిలదీస్తారు.