ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కృషి ఫలించింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ నెల్లూరులోని రామాయపట్నం వద్ద రూ.60,000 కోట్లు పెట్టుబడితో ముడి చమురు శుద్ధి (రిఫైనరీ)ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. రిఫైనరీ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో శ్రీకాకుళం, మచిలీపట్నం, రామయపట్నం మూడు ప్రాంతాలను చూపగా, రామాయంపట్నంని ఎంపిక చేసుకుంది. అక్కడ రిఫైనరీ ప్లాంట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి ఎకరాలు కేటాయిస్తుంది. ఈ నెల 29న ప్రధాని నరేంద్రమోడీ విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు బీపీసీఎల్ రామయపట్నం ప్లాంట్ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడే అంటే 2014లోనే విభజన హామీలలో భాగంగా ఏపీలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయించాలని చాలా తీవ్రంగా ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాంట్ విషయం అసలు పట్టించుకోనే లేదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రికావడం, ఈసారి ఎన్డీయేలో కీలకంగా మారడంతో చకచకా పావులు కదిపి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏపీకి ఈ రిఫైనరీ ప్లాంట్ సాధించారు. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్రంలో ఈ రిఫైనరీ ప్లాంట్ ఏర్పాటుకి అవసరమైన చర్యలు తీసుకున్నారు. కనుక ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడే దీనికీ బీజం పడబోతోంది.
ఇక విశాఖ సమీపంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద రూ.1,85,000 కోట్ల పెట్టుబడితో 1600 ఎకరాలలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అధ్వర్యంలో దేశంలోకెల్లా అతిపెద్ద (గ్రీన్) హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. దీని శంకుస్థాపనకే ప్రధాని నరేంద్రమోడీ రాబోతున్నారు.
నిజానికి ఈ ప్రాజెక్టు 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2030 నాటికి ఏడాదికి 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానిని కూడా ఏపీకి దక్కేలా చేశారు సిఎం చంద్రబాబు నాయుడు.
ఈ రెండు ప్రాజెక్టుల ద్వారానే సిఎం చంద్రబాబు నాయుడు ఏపీకి రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారు. ఇవే కాక సిఎం చంద్రబాబు నాయుడు చొరవతో ఏపీలో మరో రూ.85,083 కోట్ల పెట్టుబడులతో 10 భారీ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇవి కాక మరికొన్ని పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పెట్టుబడులు చర్చల దశలో ఉన్నాయి. జగన్ 5 ఏళ్ళలో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తేలేకపోయారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు కేవలం 5 నెలల్లోగానే ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం చాలా గొప్ప విషయమే కదా?




