బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రతో తనను అవహేళన చేశారంటూ మంత్రి అంబటి రాంబాబు ఎంతగా చిందులు వేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానల్లో దానిపై జరిగిన చర్చలో పాల్గొన్న బ్రో సినిమా నిర్మాత టిజి విశ్వప్రసాద్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“మీ సినిమా పెట్టుబడిలో అవకతవకలు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీ వెళ్ళి ఈడీకి ఫిర్యాదు చేయబోతున్నారట కదా? అనే ప్రశ్నకు, “నిరభ్యంతరంగా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఒకవేళ ఈడీ లేదా మరో సంస్థో లెక్కలు అడిగితే అన్నీ సిద్దంగా ఉన్నాయి. నేను రాయలసీమ నుంచి వచ్చాను. ఇలాంటి బెదిరింపులుకు భయపడేవాడిని కాను. అయినా దీనిని బెదిరింపుగా అనుకోవడం లేదు,” అని చెప్పారు.
“బెదిరింపులు అంటే ఏమిటి?” అనే ప్రశ్నకు “అవో గాలిమాటలు (గాలి కబుర్లు). అలాంటి గాలి పనులు నేను చేయను” అని వ్యంగ్యంగా జవాబు చెప్పారు.
అంటే “అవతలి వ్యక్తి (అంబటి రాంబాబు)కి పనిలేదంటారా?” అనే ప్రశ్నకు “ఆయనకు పని లేదని కాదు… నాకు పని ఉందని చెపుతున్నాను. కనుక అలాంటి గాలి పనులు చేయవలసిన అవసరం మాకు లేదు,” అని టిజి విశ్వప్రసాద్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
“చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తదితరులపై బురద చల్లెందుకు గతంలో కొన్ని సినిమాలు తీశారు. మళ్ళీ ఇప్పుడు రాంగోపాల్ వర్మ చేత కూడా వ్యూహం వంటి సినిమాలు తీయిస్తున్నారు. వాటిలో నేరుగా సదరు నేతలపై డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. కానీ మీ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ మీద ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది?” అనే ప్రశ్నకు “అలాంటి సినిమాలకు ప్రేక్షకులు ఉండరు. కానీ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో వంటి సినిమాలకు చాలా మంది ప్రేక్షకులు ఉంటారు. కనుక సినిమాలో ప్రేక్షకులకు నచ్చిన పాయింట్ ఉంటే అది హైలైట్ అవుతుంటుంది. ఇదీ అలానే అయ్యిందని భావిస్తున్నాము. కానీ మేము ఎవరినీ కించపరచాలని ఉద్దేశ్యంతో ఆ పాత్ర సృష్టించలేదు,” అని చెప్పారు. అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు ఉందని చెప్పకనే చెప్పారన్న మాట!



