బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ రాజేయడం కోసం ఆంధ్ర పాలకులని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని బూచిగా చూపిస్తుంటుంది. అలాగే నదీ జలాల పంపకాలను ప్రస్తావిస్తూ తెలంగాణ సెంటిమెంట్ రాజేసేందుకు ప్రయత్నిస్తుంటుంది.
కనుక కృష్ణా గోదావరి నదులు పారుతున్నంత కాలం లేదా బిఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం ఈ సమస్య అలాగే ఉంటుంది… ఉండాలి.. ఉంటేనే సెంటిమెంట్ రాజేయగలమని బిఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది.
కనుకనే నదీ జలాల పంపకాలను ఓ పెద్ద సమస్యలా మార్చేసి అవసరమైనప్పుడల్లా తీసి వాడుకుంటోంది. దీంతో బిఆర్ఎస్ పార్టీ రాజకీయ మైలేజ్ పొందుతుందటమే కాక తెలంగాణలో తమ రాజకీయ ప్రత్యర్ధులైన కాంగ్రెస్, బీజేపిలని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు కూడా నదీ జలాల పంపిణీని ఆయుధంగా వాడుకుంటోంది.
కల్వకుంట్ల కవిత తిరుగుబాటు చేయడంతో వారి కుటుంబ సభ్యుల మద్య గొడవల గురించి మాట్లాడేందుకు ఇష్టపడని కేటీఆర్, హరీష్ రావు, కవితలు ఏపీలో ఇంకా కాగితాల మీదనే ఉన్న బనకచర్ల ప్రాజెక్టు గురించి గట్టిగా మాట్లాడుతుంటారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక బిఆర్ఎస్ పార్టీ ఎత్తుగడని పసిగట్టి అది కూడా నదీ జలాల పంపిణీని వివాదమన్నట్లు మాట్లాడక తప్పడం లేదు.
తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టాన్ని పట్టించుకోకుండా, బనకచర్ల ప్రాజెక్టుతో ముందుకు సాగుతోంది. దీనిపై మేము అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి జనవారిలోనే లేఖ వ్రాశాము. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంది,” అని అన్నారు.
అయితే ఎగువనున్న తెలంగాణలో నుంచి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవహించిన గోదావరి నీళ్ళు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నందున ఆ నీటినే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా కరువు పీడిత రాయలసీమ జిల్లాలకు తరలించాలనుకుంటున్నామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. కనుక ఏపీలోకి వచ్చేసిన నీటిని తాము వినియోగించుకుంటే తెలంగాణకు అభ్యంతరం దేనికని ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ తెలంగాణకు ఇంకా నీటి అవసరాలు ఉంటే కృష్ణ, గోదావరి నదులపై మరిన్ని ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించుకొని అవసరమైన చోటికి మళ్ళించుకున్నా మాకు అభ్యంతరం లేదని ఇదివరకే స్పష్టం చేశారు.
సిఎం చంద్రబాబు నాయుడు నీళ్ళ విషయంలో ఇంత స్పష్టంగా మాట్లాడుతుంటే, బిఆర్ఎస్ పార్టీ.. దాని ఒత్తిడి కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
వాటి మద్య రాజకీయ ఆధిపత్యపోరు ఉంటే అవే అమీతుమీ తేల్చుకోవాలి కానీ మద్యలో ఏపీని, ఎప్పుడో కట్టబోయే బనకచర్ల ప్రాజెక్టుని లాగడం దేనికి?




