మార్చి-ఏప్రిల్ నెలల్లో పదో తరగతి ఇంటర్ విద్యార్ధులకు పరీక్షకు టెన్షన్ ఉంటుంది. అలాగే ఈ నెల బీఆర్ఎస్ పార్టీకి కూడా పరీక్షల టెన్షన్ నెలకొంది.
కాళేశ్వరం కమీషన్ ఏర్పాటు, ప్రభుత్వానికి అదిచ్చిన నివేదిక రెండూ రాజకీయ ప్రేరితమైనవే కనుక వాటిని కొట్టేయాలని కోరుతూ మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మరో ఇద్దరో ఐఏఎస్ అధికారులు హైకోర్టులో పిటిషన్లు వేశారు.
దానిపై విచారణ, వాదనలు ముగిసినందున నేడు తీర్పు వెలువడాల్సి ఉంది. కానీ ఏప్రిల్ 22న తీర్పు చెప్తామంటూ వాయిదా వేసింది.
ప్రభుత్వాలు కమీషన్లు ఏర్పాటు చేయడం, అవి నివేదికలు ఇవ్వడం సర్వసాధారణం. కనుక హైకోర్టులో అనవసరంగా వాటిలో జోక్యం చేసుకోవు. మహా అయితే అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ఈ కేసులో కూడా అదే జరుగవచ్చు.
కనుక ఏప్రిల్ 22న హైకోర్టు తీర్పు వెలువడగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్, హరీష్ రావులపై విచారణ వేగవంతం చేయవచ్చు. ఈ కేసులో ఏసీబీ అధికారులు వారికి నోటీసులు పంపించి విచారణకు రప్పించే అవకాశం ఉంటుంది.
దాదాపు ఇదే సమయానికి అంటే ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నారు. “బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మాతోనే ఉంది. పలువురు బీఆర్ఎస్ నేతలు మాతో టచ్‌లోనే ఉన్నారని” ఆమె ఇదివరకే చెప్పారు.
కనుక ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత పార్టీ జెండా, అజెండా ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
కనుక ఏప్రిల్ నెలలో బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెంటిలో ఎదో ఒకటి పాస్ అయితే చాలనుకోవడానికి లేదు. రెండు పరీక్షలలో తప్పనిసరిగా పాస్ అవ్వాల్సిందే. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీనపడుతుంది.




