
హైదరాబాద్‌లో మహాటీవీ న్యూస్ ఛానల్‌పై శనివారం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తెలంగాణలో కాంగ్రెస్, బీజేపిలతో పాటు ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు కూడా ఖండించాయి.
మీడియాపై దాడులు జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాగే స్పందిస్తుంది. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసుతో తన పేరుని ముడిపెట్టి మీడియా ముసుగులో కొన్ని రాజకీయ శక్తులు తనపై దుష్ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హనానానికి పాల్పడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.
Also Read – మిథున్ రెడ్డి స్వామిభక్తి ప్రదర్శిస్తే పరవాలేదు కానీ..
ఆయన దీనికి సిఎం రేవంత్ రెడ్డి బాధ్యుడన్నట్లు చెప్పగా, బిఆర్ఎస్ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావిస్తూ కేటీఆర్ మనసులో మాటని బయటపెట్టారు. ఈ మీడియా ముసుగులో ఆంధ్రా పాలకులు ఉన్నారంటూ మరో వివాదానికి ఆజ్యం పోశారు.
కాస్త ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా, హైదరాబాద్ రాజధానిగా ఉండేది. అప్పుడు ఏపీని పాలించిన ఆంధ్రా, తెలంగాణ పాలకులు అందరూ హైదరాబాద్‌ని మాత్రమే అభివృద్ధి చేస్తుండటంతో, ఆంధ్రాకు చెందిన పలువురు హైదరాబాద్ తరలివచ్చి సినీ, మీడియా, పారిశ్రామిక, వ్యాపార రంగాలను ఏర్పాటు చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.
Also Read – పేర్ని అత్యుత్సహం: అరవడానికా.? కరవడానికా.?
కానీ తెలంగాణ ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ ‘తెలంగాణ వాదం’ కోసం వారందరినీ పరాయివారుగా, దోపిడీదారులుగా చూపిస్తూ ద్వేషించడం మొదలుపెట్టారు.
కానీ అదే కేసీఆర్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారందరినీ బంగారు గుడ్లు పెట్టే బాతులని గ్రహించి అక్కున చేర్చుకున్నారు. కానీ అదే కేసీఆర్.. వారిని తన గుప్పిట్లో ఉంచుకునేందుకు ఫోన్ ట్యాపింగ్‌లు చేయించారని బాధితుల పిర్యాదులతో స్పష్టమవుతోంది.
Also Read – జగన్ మెప్పుకంటే శతృత్వమే మేలు?
మరో విషయం ఏమిటంటే, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా వేర్వేరు కారణాల చేత తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.
కానీ కేసీఆర్ మాత్రం ఏపీ రాజకీయాలలో వేలు పెట్టారు. 2019 ఎన్నికలలో జగన్‌తో చేతులు కలిపి చంద్రబాబు నాయుడుని గద్దె దించారు.
ఏపీలోకి బిఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వినియోగించుకొని ఏపీలో అడుగు పెట్టాలనుకున్నారు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం అంత ఆర్ధిక భారం భరించడం అనవసరమని భావించి చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. లేకుంటే నేడు ఏపీలో బిఆర్ఎస్ పార్టీ హడావుడి చేస్తూ ఉండేది.
నేటికీ బిఆర్ఎస్ పార్టీ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం ‘తెలంగాణ సెంటిమెంట్’ వాడుకునే క్రమంలో ‘ఆంధ్రా కార్డు’ని విరివిగా ఉపయోగించుకుంటూనే ఉంది.
కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత తదితరులు బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుండటమే ఇందుకు చక్కటి నిదర్శనం.
కేటీఆర్, కవిత తమ తెలంగాణ ప్రభుత్వం, తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కూడా చాలా చులకనగా, అనుచితంగా మాట్లాడుతుండటం, పోస్టులు పెడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కనుక వారు అందరితో ఈ విదంగా వ్యవహరిస్తూ, తమతో అందరూ విధేయంగా ఉండాలని, తమని ఎవరూ విమర్శించకూడదని, తెలంగాణ రాజకీయాలలో ఎవరూ వేలు పెట్టకూడదని కోరుకోవడం అత్యాశే కదా?
అందరినీ కలుపుకుపోయే బదులు, ‘తెలంగాణ ప్రయోజనాల కోసం’ అంటూ పార్టీ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం ప్రతీ ఒక్కరినీ శత్రువులుగా మార్చుకుని యుద్ధాలు చేస్తున్నప్పుడు బాణాలు గుచ్చుకున్నాయని బాధపడి ప్రయోజనం ఏమిటి?బిఆర్ఎస్ పార్టీ విధానంలోనే ఇలాంటి లోపం ఉంచుకొని ఎదుటవారిని విమర్శిస్తూ తిరిగివారు విమర్శిస్తే బాధపడటం దేనికి?