త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం అధికార – ప్రతిపక్షాలు తమ తమ అస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలలో సైతం అధికార కాంగ్రెస్ తన హవా కొనసాగించగా, ప్రతిపక్ష బిఆర్ఎస్ కూడా కాస్త బలం పుంజుకుని అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది.
దీనితో తిరిగి కాన్ఫిడెన్స్ లోకి వచ్చిన బిఆర్ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికలలో సైతం తమ సత్తా చాటి రేవంత్ సర్కార్ తమ పార్టీ మీద పార్టీ నేతల మీద వేస్తున్న అవినీతి ఆరోపణలను, ఫోన్ టాపింగ్ కేసు విచారణలను తిప్పికొట్టాలని భావిస్తుంది.
అలాగే కాంగ్రెస్ కూడా బిఆర్ఎస్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని, తన పార్టీ సైన్యాన్ని ఎన్నికల యుద్దానికి సిద్ధం చేస్తుంది. ఇక బీజేపీ ఈ రెండు పార్టీల రాజకీయం మధ్య ఆటలో అరటి పండు మాదిరి గేమ్ స్టార్ట్ చెయ్యాలా లేదా చేసినట్టు నటించాలా అన్న మీమాంశలో ఉంది.
అయితే ఈ మూడు పార్టీల పరిస్థితి ఇలా గెలుపు – ఓటమి మధ్య నడుస్తుంటే బిఆర్ఎస్ నుంచి బయటకొచ్చి జాగృతి పేరుతో కొత్త రాజకీయ ప్రయాణం మొదలు పెట్టిన కవిత పరిస్థితి మరోలా ఉంది.
ముందుగా ఈ మున్సిపల్ ఎన్నికల బరిలో కవిత జాగృతి కూడా దిగి తన తొలి రాజకీయ అడుగు వేస్తుంది అంటూ మీడియాలో వార్తలు వచ్చినా అందుకు జాగృతి ఇంకా సిద్ధంగా లేదు అంటూ కవిత ఈ ఎన్నికల గేమ్ నుంచి తప్పుకుని గేమ్ ఛేంజర్ మాదిరి మారాలని చూస్తున్నారు.
ఇప్పటికే ఒకపక్క బిఆర్ఎస్ నాయకుల టార్గెట్ గా కవిత చదరంగం మొదలుపెట్టారు. అందులో హరీష్ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. కేటీఆర్ ని గురి పెట్టి అవకాశం కోసం వేచి చూస్తున్నారు. ఇక సంతోష్ గూఢచారి రహస్యాలు బట్టబయలు చేస్తూ కేసీఆర్ కోట రహస్యాలను బయటకు తెస్తున్నారు.
ఇలా బిఆర్ఎస్ లోని ముఖ్య నాయకులను, నాటి బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ కవిత సంధిస్తున్న విమర్శనాబాణాలు కవిత ఆశించినట్టుగా ప్రజలకు చేరువ అయితే వాటి ప్రభావం ఖచ్చితంగా బిఆర్ఎస్ ఎన్నికల ఫలితాల మీద పడుతుంది.
ఒకవేళ కవిత ప్రణాళిక ఫలించినా, లేక అధికార పార్టీ వ్యూహాలు ఫలితాలనిచ్చినా బిఆర్ఎస్ భారీ మూల్యమే చెల్లిస్తుంది. దీనితో అటు బిఆర్ఎస్ పై ఆ పార్టీ నేతల పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, కవిత చేస్తున్న ప్రకటనలు బిఆర్ఎస్ పై ప్రభావం చూపుతున్నాయనేది స్పష్టమవుతుంది.
మరి ఆ గేమ్ ఛేంజర్ గా కవిత తన రాజకీయ చదరంగాన్ని ఆడగలరా.? అలాగే తన ఆటతో తనను అవమానించి బయటకు పంపిన బిఆర్ఎస్ ని ఓడించగలరా.?






