ఊహించినట్లే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న వెన్నుపోటు కోసం అనుచరులతో కలిసి బైక్‌పై ర్యాలీతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరినప్పుడు, దారిలో సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. అప్పుడు అంబటి రాంబాబు ఆయనని దుర్భాషలాడుతూ దమ్ముంటే అడ్డుకోమని సవాలు చేశారు. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి పట్ల అనుచితంగా వ్యవహరించినందుకు అంబటి రాంబాబుతో అనుచరులపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు.
వైసీపీలో కాస్త నోటి దురుద ఎక్కువున్న నేతలలో అంబటి రాంబాబు కూడా ఒకరైనప్పటికీ ఇంతవరకు ఆయనపై కేసులు లేవు. కనుక ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఈ కేసు నమోదైంది కనుక ఇక ఆయన కూడా పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగక తప్పదు. అయితే ఇది కూటమి ప్రభుత్వమో, పోలీసులో ఇచ్చిన కానుక కానే కాదు. వెన్నుపోటు పొడవమని చెప్పి వైసీపీ శ్రేణులను రోడ్లపైకి పంపించిన వారి అధినేత జగన్ ఇచ్చిన కానుకే.
నాడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను, కార్యకర్తలని పోరాడమని చెప్పి జగన్‌లా ఇంట్లో కూర్చోలేదు. వారితో కలిసి నిత్యం ప్రజల మద్య ఉంటూ పోరాడుతుండేవారు. ఆయనతో పాటు నారా లోకేష్ టీడీపీ సీనియర్ నేతలందరూ కూడా కార్యకర్తలతో కలిసి జగన్ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉండేవారు.
కానీ జగన్ వైసీపీలో అందరినీ రోడ్లపైకి పంపించి తాను బెంగళూరు వెళ్ళిపోయి సేద తీరుతున్నారు. ఈ విషయం గ్రహించకుండా జగన్ కళ్ళలో ఆనందం చూసేందుకు అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు రెచ్చిపోయి చేజేతులా కేసులు కొనితెచ్చుకొని జైలు పాలవుతున్నారు.
ఒకవేళ వారు జైలుకి వెళితే జగన్ వచ్చి పరామర్శించి వెళుతుంటారు. కానీ అలా వచ్చినప్పుడు కూడా వైసీపీ శ్రేణులని పోగేసుకొని జేజేలు పలికించుకొని వెళుతుంటారు! జగన్ కోసం ఇలా రోడ్లపైకి వచ్చి కొట్లాడిన నేతలు అరెస్ట్ భయంతో అజ్ఞాత జీవితం గడుపుతూ లేదా బెయిల్ కోసం ఎదురుచూస్తూ వల్లభనేని వంశీలా జైల్లో చిక్కుకుపోతుంటారు. కనుక మారాల్సింది జగన్ లేదా ప్రజలో కాదు. వైసీపీ నేతలు, కార్యకర్తలే!




