పాడు లోకం… ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూనే ఉంటుంది. నాడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడినే వదల్లేదు… వారికే నీలాపనిందలు తప్పలేదు… మాజీ సిఎంలమైన మాకు తప్పుతుందా!
ఈ జనాలు వద్దనుకుంటే వాళ్లకి మేము నవ్వినా తప్పే… ఏడ్చినా తప్పే! ఇంట్లో కూర్చున్నా తప్పే… బయటకొచ్చి రప్పా రప్పా అన్నా తప్పే!
నన్ను చూసి చాలా రోజులైందని చాలా మంది బాధపడుతున్నారు. అదీగాక బయటకు రాకపోతే నాకేదో అయిపోయిందని పసుపు పుకార్లు పుట్టే ప్రమాదం కూడా ఉంది. కనుక అప్పుడప్పుడు పరామర్శలు తప్పవు.
అలా బయలుదేరినప్పుడు జేజేలు పలికేందుకు, మావాళ్ళు సమీకరణ చేసి పంపించిన అభిమానులకు చేతులెత్తి దండాలు పెడుతూ చిర్నవ్వు నవ్వితే… ‘ఇదేం చోద్యం చనిపోయినవారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతూ ఆ వెకిలి నవ్వులేమిటి? అని బుగ్గలు నొక్కుకుంటారు
అయినా పరామర్శకు వెళుతున్నప్పుడు ఏడుపు మొహం పెట్టుకొని వెళ్ళాలని ఎక్కడైనా రూల్ ఉందా? లేదు కదా?
మా నవ్వులు… వాళ్ళ ఏడ్పులు చూస్తున్నప్పుడు ‘నేను నవ్వాను ఈ లోకం ఏడ్చిందీ… నేను ఏడ్చాను ఈ లోకం నవ్విందీ…’ అనే పాట గుర్తొస్తుంటుంది. లోకం తీరే అంత!
మద్యలో ఈ పోలీసులోళ్ళ హడావుడి ఒకటి. బయటకొస్తే మూడు కార్లే ఉండాలి.. ముప్పై మందే ఉండాలంటూ అర్ధం పర్ధం లేని ఆంక్షలు విధించడం… వాటిని ఉల్లంగించామని ఆనక కేసులు పెట్టడం దురలవాటుగా మారిపోయింది.
అయినా నేనేమైన చంద్రబాబునా… పవన్ కళ్యాణ్‌నా ఒంటరిగా బస్సులు, ఆటోలలో ప్రయాణించడానికి?నాకున్న ఫాలోవర్స్ వాళ్ళకు లేరు కనుక వాళ్ళకి ఇవన్నీ అర్ధం కావు. పరామర్శ యాత్రో… మరొకటో.. కానీ నేను బయటకు వస్తే నా వెనక ఇంతమంది ఉన్నారని మాకూ, మీకూ లెక్క తెలుస్తుంది కదా? అర్ధం చేసుకోరూ!
సరే ఇంతకీ విషయం ఏమిటంటే మొన్న కోర్టుకి రానంటే అందరూ తప్పు పట్టారు. ఇప్పుడు వస్తున్నా తప్పు పడుతున్నారు. ఏమిటీ పాడులోకం? అప్పటికీ నేను కోర్టుకి వస్తే నాకు కాదు… మీకే ఇబ్బందని హెచ్చరించాను కదా? విన్నారా? లేదే! ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం?
ఇన్నేళ్ళ తర్వాత సీబీఐ కోర్టుకి వస్తున్న నన్ను చూసేందుకు జనాలు రాకుండా ఉంటారా? తిరుమల వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులను దర్శించుకోనీయకుండా వెనక్కి తిప్పి పంపేస్తే హర్ట్ అవరూ?
అలాగే మావాళ్ళు హర్ట్ అయిపోతారనే విషయం వీళ్ళకి ఎప్పటికీ అర్ధం కాదు. హైదరాబాద్‌లో కూడా బలప్రదర్శన అవసరమా?అంటూ వెకిలి ప్రశ్నలు… వెకిలి నవ్వులు!
ఈ తెలంగాణ పోలీసులు కూడా ఇంతే! ఒకటే ఆంక్షలు… ఎక్కడ చూసినా బ్యారికేడ్లు… పోలీసులే. కోర్టు విచారణకు వెళుతున్నవారికి సాదరంగా స్వాగతం పలకకూడదని, జేజేలు పలకొద్దని రాజ్యాంగంలో రాసి ఉందా? లేదు కదా?మరి ఎయిర్ పోర్టులో మావాళ్ళని ఎందుకు అనుమతించడం లేదో అర్ధం కాదు.
బయలుదేరింది పరామర్శ యాత్రకా… నాంపల్లి సీబీఐ కోర్టు విచారణకా అనేది ఇక్కడ పాయింట్ కాదు. అభిమానులు వెంటపడి జేజేలు పలుకుతున్నారనే అందరి ఏడ్పులు. ఏం చేస్తాం!
ఈ లోకాన్ని ఉద్దరించడానికి జన్మించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంతటివారినే ఈ పాడులోకం బాధించింది. ఆంధ్రాని ఉద్దరించేందుకు జన్మించిన మావంటి సత్పురుషులను ఈ లోకం గుర్తించలేదు. వారి అజ్ఞానానికి జాలిపడుతూ… క్షమించేస్తూ జేజే ధ్వానాల మద్య సీబీఐ కోర్టుకు సాగిపోతూనే ఉంటాము… ఆగేదేలే!






