అవినాష్ రెడ్డి చుట్టూ సీబీఐ ప్రదక్షిణాలు… నేటితో ముగుస్తాయా?

YS_Sunith_Reddy_YS_Avinash_Reddyవివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు రావడంతో శుక్రవారం విచారణకు హాజరుకాలేనని తన న్యాయవాదుల ద్వారా సీబీఐకి తెలియజేసి వెళ్ళిపోయారు. కనుక సోమవారం విచారణకు హాజరుకావలసిందిగా సీబీఐ ఆయనకు మరో నోటీస్ పంపించగా, ఈరోజు కూడా విచారణకు హాజరుకాలేనని సీబీఐకి తెలియజేశారు. దీంతో ఈరోజు ఉదయమే సీబీఐ అధికారులు ఆయన తల్లికి చికిత్స పొందుతున్న కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్‌ వద్దకు చేరుకొన్నారు.

విచారణకు పిలిచిన ప్రతీసారి ఆయన ఏదో సాకుతో రాకుండా తప్పించుకొంటున్నప్పటికీ సీబీఐ ఆయనను ఏమీ చేయలేకపోతుండటంతో సీబీఐ మీద ఒత్తిడి పెరుగుతోంది. కనుక సీబీఐ నేడు అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నిన్న ఉదయం నుంచే విశ్వభారతి హాస్పిటల్‌ వద్దకు అవినాష్ రెడ్డి అనుచరులు భారీ సంఖ్యలో రావడం మొదలైంది. ముందస్తు జాగ్రత్త చర్యగా హాస్పిటల్‌ పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించి ఆయన అనుచరులను అడ్డుకొని దూరంగా నిలిపివేస్తున్నారు. ఆదివారం రాత్రి హాస్పిటల్‌ వద్ద మీడియా ప్రతినిధులపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేసి వారి కెమెరాలను ధ్వంసం చేశారు.

ADVERTISEMENT

దొంగాపోలీస్ ఆటలా నెలల తరబడి సాగుతున్న ఈ అవినాష్ రెడ్డి-సీబీఐ విచారణ కధలో సీబీఐది పైచేయి కావలసి ఉండగా, ప్రతీసారి అవినాష్ రెడ్డిదే పైచేయిగా ఉంటోంది. ఆయనను అరెస్ట్‌ చేయకతప్పదని హైకోర్టులో పదేపదే చెపుతున్న సీబీఐ, నేటికీ ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది.

ఇదే కేసులో నిందితుడుగా ఉన్న ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని తలుచుకొన్న వెంటనే కడపకు వచ్చి అరెస్ట్‌ చేసిన సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేకపోతున్నారు? ఆయన విచారణకు హాజరుకాకుండా సీబీఐని సవాలు చేస్తున్నారా లేదా సీబీఐ అధికారులే మెతక వైఖరి అవలంభిస్తూ ఆయనకు ఈ అవకాశం కల్పిస్తున్నారా?అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కనుక ఈరోజైనా సీబీఐ ఆయన చుట్టూ ప్రదక్షిణాలకు ముగింపు పలుకుతుందా లేక మరో నోటీస్ ఆయన చేతిలో పెట్టి వెనుతిరిగి ఈ కధని ఇలాగే కొనసాగిస్తుందా?అనే విషయం మరికొద్ది సేపటిలో తేలిపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories