వైఎస్ వివేకా హత్య జరిగిన చాలా కాలం తర్వాత ఆ కేసు విచారణ చేపట్టిన సీబీఐ వివేకా హంతకులు ఎవరో కనుగొనేందుకు చాలా శ్రమించిన మాట వాస్తవం. అంత గ్యాప్ తర్వాత దర్యాప్తు జరపడం, సాక్షులను విచారించి ఆధారాలు సేకరించడం, నిందితులను విచారించి వారిపై పూర్తి సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం చాలా గొప్ప విషయమే.
అయితే ఈ కేసును రాజకీయాలు ప్రభావితం చేస్తుండటం వలన కేసు విచారణ చాలా మెల్లగా ముందుకు సాగుతోంది. ఆ రాజకీయ లంకె లేకపోయి ఉంటే సీబీఐ ఈ కేసు విచారణను బహుశః ఎప్పుడో ముగించి ఉండేది.
కారణాలు ఏవైతేనేమి, వివేకా హంతకులు ఎవరో నేటికీ తేలలేదు. కనుక సుప్రీంకోర్టు చేత సీబీఐ మొట్టికాయలు వేయించుకొంది. ఈ కేసులో కొందరు లోపలుంటే, మరికొందరు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అది వేరే విషయం.
ఈ కేసు విషయంలో ఇటు అధికార వైసీపీ నేతలు, అటు ప్రతిపక్ష టిడిపి నేతలు కూడా సీబీఐ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం విశేషం. చంద్రబాబు నాయుడు, సునీతారెడ్డి చెప్పినట్లు సీబీఐ నడుచుకొంటూ, అమాయకుడైన తమ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని దోషిగా నిరూపించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందని, అందుకోసం ‘గూగుల్ టేకవుట్’ అంటూ కాకమ్మ కధలు చెపుతూ తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించాలని విసప్రయత్నం చేసి విఫలమై చివరికి చేతులు ఎత్తేసిందని వైసీపీ ఆరోపిస్తోంది.
మరోపక్క ప్రతిపక్షాలు, మీడియా కూడా సీబీఐనే తప్పు పడుతున్నాయి. ఈ కేసులో నిందితుడుగా పేర్కొన్న భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ, ఇదే కేసులో మరో నిందితుడుగా పేర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీస్తున్నారు. అతని ముందస్తు బెయిల్ విషయంలో కూడా సునీతారెడ్డి ఒక్కరే సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు తప్ప సీబీఐ చొరవ చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి సీబీఐ చేయవలసిన పనులు, న్యాయపోరాటం సునీతా రెడ్డి చేస్తున్నారని, అయినా సీబీఐ ఎప్పుడూ ఆమెకంటే వెనుకే ఉండిపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. సీబీఐ ఉద్దేశ్యపూర్వకంగానే అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా వెసులుబాటు కల్పిస్తోందని ప్రముఖ న్యాయవాది జాడ శ్రావణ్ కుమార్ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
అయితే సీబీఐ ఈ కేసు విచారణను ఎందుకు ముగించలేకపోతోందో?వివేకా హంతకులను ఎందుకు కోర్టు బోనులో నిలబెట్టలేకపోతోందో అందరికీ తెలుసు. సీబీఐ కాళ్ళు,చేతులు కట్టేసి విచారణ చేయలేకపోతోందని నిందించడం కూడా సరికాదు. కనుక ఏతావాతా తేలేది ఏమిటంటే, ఈ కేసుపై రాజకీయ ప్రభావం, ఒత్తిళ్ళు ఉన్నంతకాలం సీబీఐ మాత్రమే కాదు… ఎవరూ ఏమీ చేయలేరు. కనుక ఈ కేసు గురించి వచ్చే వార్తలను చదువుకొంటూ ఎవరికి తోచిన్నట్లు వారు విశ్లేషించుకొంటూ కాలక్షేపం చేసేయక తప్పదు.



