డ్వాక్రా మహిళా సంఘాలు, రైతు బజార్లు, హైటెక్ సిటీ, క్వాంటం కంప్యూటర్లు, డ్రోన్ సిటీ… ఇలా సమాజ గతిని మార్చేయగల గొప్ప గొప్ప ఆలోచనలన్నీ సిఎం చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలరేమో అనిపిస్తుంది… అయన తాజా ప్రతిపాదన విన్నప్పుడు!
కరోనా, లాక్ డౌన్‌లోడ్ పుణ్యామాని ‘వర్క్ ఫ్రం హోం’ విధానానికి అటు సంస్థలు, ఇటు ఉద్యోగులు అందరూ అలవాటు పడ్డారు. కానీ ‘వర్క్ ఫ్రం హోం’ విధానంలో కూడా మరిన్ని మార్పులు చేయవచ్చని నిరూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘వర్క్ స్పేస్ పాలసీ’ ప్రకటించింది.
ముంబాయి, హైదరాబాద్ వంటి నగరాలలో వివిధ సంస్థలకు చెందిన ఉద్యోగులు కలిసి ఒక చోట పనిచేసుకునేందుకు వీలుగా కొన్ని ప్రైవేట్ సంస్థలు లేదా వ్యక్తులు ‘వర్క్ స్పేస్’ లేదా ‘వర్క్ స్టేషన్స్’ ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు. కానీ అవి ఆయా ప్రాంతాలలో వారు మాత్రమే ఉపయోగించుకోగలరు.
ఆ పరిమితులను చెరిపేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ మండల కేంద్రంలో ప్రభుత్వ భవనాలలో లేదా ప్రైవేట్ సంస్థలు లేదా వ్యక్తుల భవనాలలో సకల సౌకర్యాలతో కూడిన ‘వర్క్ స్పేస్’ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా ‘వర్క్ స్పేస్’ పాలసీ ప్రకటించింది. దీనిని ప్రోత్సహించేందుకు పలు రాయితీలు కూడా ప్రకటించింది. ఆ వివరాలు:
కనీసం 1,000 గజాల విస్తీర్ణంలో భవనాలు ఉండాలి. వాటిలో ఒకే సమయంలో 610 మంది ఐటి ఉద్యోగులు పని చేసుకోనేందుకు వీలుగా హైస్పీడ్ ఇంటర్నెట్, ఏసీ, నిరంతర విద్యుత్, అవసరమైన ఫర్నీచర్ కలిగి ఉండాలి.
అలాగే ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ప్రత్యేకంగా గది ఉండాలి. విద్యార్ధులకు వివిధ కంప్యూటర్ కోర్సులు లేదా డిజిటల్ స్కిల్స్ శిక్షణ కోసం అవసరమైన ఏర్పాట్లు ఉండాలి. ప్రింటింగ్, స్కానింగ్, జిరాక్స్, లాకర్లు, మినీ క్యాంటీన్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కలిగి ఉండాలి.
ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలలో ఇటువంటి సౌకర్యాలతో ‘వర్క్ స్పేస్’ ఏర్పాటు చేసేవారు 5 ఏళ్ళ పాటు అద్దె చెల్లించకుండా వాడుకోవచ్చు. ఆ అద్దెని ప్రభుత్వమే భరిస్తుంది.
అదే… సొంత లేదా అద్దె భవనాలలో వీటిని ఏర్పాటు చేసేవారికి 50 శాతం అద్దె లేదా ఏడాదికి గరిష్టంగా రూ.6 లక్షలు మించకుండా ప్రభుత్వమే చెల్లిస్తుంది. హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఛార్జీలలో 50 శాతం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ఇంతేకాదు… ప్రభుత్వం మరో గొప్ప ఆఫర్ కూడా ఇస్తోంది. ముందుగా ‘వర్క్ స్పేస్’ ఏర్పాటు చేసేందుకు వచ్చేవారికి 60 శాతం పెట్టుబడి రాయితీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది గరిష్టంగా రూ.15 లక్షలని నిర్ణయించింది.






