ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్గ విచారణ తర్వాత ఏసీబీ కోర్టు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా జైల్లో వేయాలనే పంతాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చుకొన్నారు.
బహుశః లండన్‌లో ఉన్న ఆయనతో సహా వైసీపీ నేతలందరూ పైశాచిక ఆనందం అనుభవిస్తుండవచ్చు. అయితే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం వలన ఎవరు నష్టపోతారు?అని ఆలోచిస్తే వైసీపియే అని చెప్పక తప్పదు.
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తేనే రాష్ట్రవ్యాప్తంగా ఎంత ఆందోళనలు జరిగాయో అందరూ కళ్ళారా చూశారు. ఈరోజు కోర్టులో వాదనలు జరుగుతున్నంతసేపు రాష్ట్రవ్యాప్తంగా సామాన్యప్రజలు సైతం తీవ్ర ఆందోళన చెందారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేయించిందని సామాన్య ప్రజలు సైతం అనుకొంటున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుపట్ల ఈవిదంగా వ్యవహరించి ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు.ఇక టిడిపి నేతలు, కార్యకర్తలని పోలీసులతో ఎంతగా నిర్బంధించినప్పటికీ లక్షాలదిగా రోడ్లపైకి వచ్చి తమ అధినేత కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
దీనిని వైసీపీ నేతలు గట్టిగా సమర్ధించుకొంటూ, చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారు కనుకనే జైలుకి వెళ్ళారని సమర్ధించుకోవచ్చు. కానీ వైసీపీకి ఇది రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే అని భావించవచ్చు. ఏవిదంగా అంటే, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయకుండా ఉన్నంతకాలం ఆయనపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా వైసీపికి వాటితో రాజకీయంగా ఎంతో కొంత మైలేజీ లభిస్తుండేది.
కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో వేయడం వలన హటాత్తుగా రాష్ట్రంలో ప్రజల మూడ్ మార్చేసిన్నట్లయింది. ఇంతకాలం టిడిపి పట్ల న్యూట్రల్‌గా ఉన్నవారు, కాస్త వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్ల సానుభూతి కారణంగా టీడీపీ వైపు మొగ్గు చూపడం ఖాయం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలనలో ప్రతీకారరాజకీయాలు జరుగుతున్నాయనే విషయం చంద్రబాబు నాయుడుని జైలుకి పంపించడంతో ధృవీకరించిన్నట్లయింది. దీని వలన టిడిపికి సానుభూతి పెరుగుతుంది. వైసీపీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఇంతకాలం వైసీపి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఆరాచకాలు, అవినీతి, అక్రమాలు, సామాన్య ప్రజలపై ఎంత భారం మోపినా భరించారు. రాజధాని కట్టకుండా మూడు రాజధానుల పేరుతో కాలక్షేపం చేస్తున్నా భరించారు. కానీ శిశుపాలుడు వంద తప్పులు చేసేవరకు శ్రీకృష్ణుడు కూడా ఓపికపట్టిననట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కూడా ఇంతకాలం చాలా ఓపికపట్టారు.
కానీ ఈ ఒకే ఒక్క తప్పుతో వచ్చే ఎన్నికలలో వైసీపిని భూస్థాపితం చేయడం ఖాయం. దీని వలన ఈ వయసులో చంద్రబాబు నాయుడు శారీరికంగా, మానసికంగా చాలా ఒత్తిడికి గురికావచ్చు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఇందుకు చాలా బాధపడుతుండవచ్చు.
కానీ ఆయనకు వచ్చిన ఈ కష్టమే టిడిపి భవిష్యత్‌ని మార్చేయబోతోందని ఖచ్చితంగా చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడుని జైల్లో వేసి జగన్‌మోహన్ రెడ్డి తన పతనాన్ని తానే సిద్దం చేసుకొన్నారని చెప్పక తప్పదు. ఆయనతో పాటు వైసీపి నేతలందరూ ఈ తప్పుకి భవిష్యత్‌లో చాలా భారీ మూల్యం చెల్లించబోతున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు.



