సిఎం చంద్రబాబు నాయుడు శనివారం మంగళగిరిలో టిడిపి సభ్యత్వం స్వీకరించి సభ్యత్వ నమోదు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“1995లో రాజకీయంగా పార్టీని, పాలన పరంగా ప్రభుత్వాన్ని సమర్ధంగా నడిపించాము. దశాబ్ధం తర్వాత అదే సరైన ఫార్ములా అని స్పష్టమైంది. కనుక ఈసారి పార్టీ రాజకీయాలకు, పాలనకు సమాన ప్రాధాన్యం ఇస్తాను,” అని అన్నారు.
రెంటిలో ఒకదానిపై శ్రద్ద పెట్టి మరొకదానిని నిర్లక్ష్యం చేస్తే ఎంత ఎదురులేని పార్టీలకైనా పరాజయం తప్పదని టిడిపి, వైసీపి, బిఆర్ఎస్ పార్టీలు నిరూపించాయి. కనుక ఈసారి ‘రాజకీయాలతో కూడిన పాలన’ చేస్తానని సిఎం చంద్రబాబు నాయుడు విస్పష్టంగా ప్రకటించారు.
టిడిపి అధికారం కోల్పోయి జగన్ ప్రభుత్వ వేధింపులు భరించి ఎదుర్కొంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బలంగా నిలబడి పోరాడుతూ అధికారంలోకి రాగలిగింది.
ఇప్పుడు జగన్‌ని, వైసీపి చెలరేగిపోతుంటే చంద్రబాబు నాయుడు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించేవారు సైతం ఆశ్చర్యపోయేలా పావులు కదుపుతూ జగన్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్‌ని యావత్ దేశ ప్రజల ముందు దోషిగా నిలబెట్టడమే ఇందుకు నిదర్శనం.
ఇప్పుడు జగన్-షర్మిల ఆస్తుల వ్యవహారానికి చంద్రబాబు నాయుడు చాలా దూరంగా ఉంటున్నప్పటికీ, ఆయన పేరు తలుచుకుంటూ జైలుకి వెళ్ళాల్సి వస్తుందేమో అని జగన్ ఆందోళన చెందుతుండటం గమనిస్తే సిఎం చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రభావం ఏవిదంగా ఉంటుందో స్పష్టమవుతుంది.
తాజాగా టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టి పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సంక్షేమ పధకాలను కూడా మెల్లగా ప్రారంభించారు.
జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు, పాలన, అభివృద్ధి పక్కన పెట్టి కేవలం రాజకీయాలే చేశారు. కానీ దాని వలన వైసీపికి బదులు టిడిపికి మేలు కలిగింది.
ఇప్పుడు వైసీపి ప్రతిపక్షంలోకి మారిన తర్వాత రాజకీయాలు చేస్తుంటే వాటినీ సిఎం చంద్రబాబు నాయుడు అలవోకగా ఎదుర్కొంటూ ధీటుగా తిప్పి కొడుతున్నారు తప్ప ఎంత ఒత్తిడి వస్తున్నా సంయమనం కోల్పోవడం లేదు. చాలా తాపీగా, నిశబ్ధంగా వైసీపిని కట్టడి చేస్తున్నారు.
మరోపక్క అమరావతి, పోలవరం నిర్మాణ పనులు, పరిశ్రమలు, పెట్టుబడులు, కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి రోడ్లు, రైల్వే మార్గాలు సాధిస్తున్నారు.
టిడిపి అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీని రాజకీయంగా యాక్టివ్‌గా ఉంచుకుంటూ నేతలు, కార్యకర్తలకి అండగా నిలబడి క్యాడర్ చెల్లాచెదురు కాకుండా కాపాడుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన మేరకే కాస్త రాజకీయాలు చేస్తూ పాలన, అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు టిడిపిని నడిపిస్తున్న ఈ తీరు చూస్తున్న వైసీపిలో నేతలు, వారి అనుకూల మీడియా మన అధినేత జగన్ ఈవిదంగా ఎందుకు పనిచేయలేకపోతున్నారు? అని అనుకొంటున్నారు. అంటే శత్రువులకి కూడా సిఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తిగా నిలుస్తున్నట్లే కదా?




