ఏ.పి రాష్ట్ర రాజకీయాలును నిశితంగా పరిశీలిస్తే “ప్రత్యేక హోదా” అనే పదం చుట్టూనే అన్ని రాజకీయ పార్టీలు వారి వారి ప్రత్యేకతను చాటుకోవడానికి ; ఆయా రాజకీయ పార్టీల హోదాను పెంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష పార్టీ ఏమో ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపి, అసలు జవాబుదారిగా ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం కూడా చేయడం లేదు, మరి దానికి కారణాలు ఏమిటో వారికే అవగతం!
అయితే ఇందులో అసలు ముద్దాయి ఎవరో ఒక్క సారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకుల మాటలు. రాష్ట్ర ముఖ్యమంత్రి “ఏ.పి.” చిన్న పసిపాప లాంటిది, దానిని మనమే జాగ్రతగా చుసుకోవాలని లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అందుకనే “ప్రత్యేక హోదా”కు బదులుగా “ప్రత్యేక ప్యాకేజికి” కొన్ని ‘ప్రత్యేక’ పరిస్థితులలో ఒప్పుకోవాల్సి వచ్చిందని వివిధ సందర్భాలలో పేర్కొన్నారు. ఇందులో ప్రజలు అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే…
ఏ.పిని పసిబిడ్డతో పోల్చిన బాబు గారు, ‘ప్రత్యేక హోదా’ వంటి ‘తల్లి పాలు’ పసిబిడ్డకు అవసరం, అదే ఆరోగ్యం కూడా! అయితే తల్లి స్థానంలో న్యాయం చేయాల్సిన కేంద్రం (మోడీ సర్కార్), “తల్లి పాలు పట్టడం చట్ట వ్యతిరేకం” అన్న రీతిలో వ్యాఖ్యలు చేస్తూ, అందుకు బదులుగా “డబ్బా పాలు” మంజూరు చేస్తామని చెప్పుకొచ్చింది. అయితే తండ్రి స్థానంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లి పాలు లభించలేని పరిస్థితులలో బిడ్డ ను బ్రతికించుకోవడానికి డబ్బా పాలైనా (ప్రత్యేక ప్యాకేజ్) తీసుకొని బిడ్డ ఆకలి తీర్చాలనుకున్నారని భావించి ఉండవచ్చు.
బిడ్డ బ్రతకాలి అంటే ప్రస్తుతానికి తల్లి పాలా? డబ్బా పాలా? అన్న ప్రశ్న కన్నా ముందు పాలు పట్టామా? లేదా? అనేదే ముఖ్యం. తల్లి పాల కోస౦ ఎదురుచూసి అవి దక్కలేదని భాదపడి, చివరికి చేయిదాటిపోయే పరిస్థితి వస్తే… అప్పుడు ఇవే రాజకీయ పార్టీలు, అదే రాజకీయ నాయకులు ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపుతారు. ఇక్కడ రాష్ట్రానికి కావలసినది “నిందలు – ప్రత్యారోపణలు” కాదు, అంతేకంటే ముఖ్యంగా “దోషులు – నిర్దోషులు” ఎవరన్నది కాదు! “జరిగిన అన్యాయం – జరగాల్సిన న్యాయం!”
తల్లి పాలు ఇవ్వకపోవడం తల్లి పాపం అయితే కనీసం దానిని సమాజానికి చెప్పకుండా, తన హక్కును చంపేస్తున్నా రోధించని బిడ్డది కూడా నేరమే అవుతుందని ముఖ్యమంత్రికి ఇప్పుడు అర్ధం అయినట్లుంది. అందులో భాగమే పార్లమెంట్లో ఈ విమర్శల హడావుడి! చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసారు అనే విమర్శలను మూటకట్టుకున్నారు ముఖ్యమంత్రి వర్యులు. హోదా అయినా, ప్యాకేజి అయినా అది ప్రభుత్వాల అవసరాల కోసం కాదు, అది రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే!
రాష్ట్ర ప్రజల అనుమతి లేకుండా రాష్ట్ర విభజన జరిగిపోయింది. అలాగే రాష్ట్ర ప్రజల అవసరాలు తెలుసుకోకుండా విభజన చట్టం రూపుదిద్దుకు౦ది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తెలుసుకోకుండాన్నే చట్టాన్ని సమాధి కూడా చేసేసారు. ఇప్పుడు అందరూ, అన్ని పార్టీలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని తమ తప్పులేదని, తమకు సంబంధం లేదని, పార్లమెంట్లో చేసిన చట్టాలకు మన ప్రభుత్వాలు ఎంతలా కట్టుబడి ఉంటాయో సామాన్యులకు తెలియచెప్పే ప్రయత్నంలో అన్ని రాజకీయ పార్టీలు వందకు వంద శాతం విజయం సాధించారని చెప్పక తప్పదు.
నేరం ప్రభుత్వాలు చేసి శిక్ష ప్రజలను అనుభవించమన్న చందంగా మనదేశంలో ప్రభుత్వాల వైఖరి, మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాల వైఖరి ఉంటున్నాయి. ఇలాగే ప్రభుత్వాల వైఖరి కొనసాగితే కొన్ని రోజులకి ప్రజలు కుడా ప్రభుత్వాలు చేసిన చట్టాలకు లోబడి వ్యవహరించకపోతే అప్పుడు ప్రజల ముందు ఈ ప్రభుత్వాలే ముద్ధాయిలుగా నిలబడాల్సి వస్తుందేమో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇటువంటి సందర్భంలో మాత్రం నేరం ప్రజలది, శిక్ష ప్రభుత్వానిది అవుతుందనేది ప్రభుత్వాలు గుర్తుంచుకోవలసి ఉంటుంది.



