ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నేడు అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యుబుల్ ఎనర్జీ సంస్థ నిర్మిస్తున్న ‘క్లీన్ ఎనర్జీ’ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రూ.5,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “తెలంగాణలో రంగారెడ్డి జిల్లా పరిశ్రమలతో నిండిపోయింది. కనుక ఏపీతో సహా పలు రాష్ట్రాల నుంచి నిరుద్యోగులు హైదరాబాద్ వలసలు వెళుతున్నారు. కానీ ఇప్పుడు మన రాష్ట్రానికే లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తున్నాయి.
అనకాపల్లి జిల్లాలోనే రూ. 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఆర్స్‌లర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాబోతోంది. ఇంకా చాలా పరిశ్రమలు రాబోతున్నాయి. వీటితో అనకాపల్లి జిల్లా రంగారెడ్డి జిల్లాని మించిపోతుంది.
కనుక రాబోయే రోజుల్లో ఏపీ నుంచి ఎవరూ ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్ లేదా బెంగళూరు వలసలు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. భవిష్యత్ ఇతర రాష్ట్రాల వారే ఏపీకి వలసలు వస్తారు,” అని అన్నారు.
చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించడంపై శ్రద్ధ వహిస్తారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. కనుక ఒకప్పుడు ఏపీలో అరాచకాలు చూసి భయాపడి పారిపోయినవారే ఇప్పుడు క్యూ కడుతున్నారు.
ఇదివరకు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడుపై అసూయ, ద్వేషంతో అమరావతి మొదలు అన్నా క్యాంటీన్ల వరకు అన్నిటినీ పక్కన పడేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజధాని అమరావతి వద్దు మావిగన్ అంటున్నారు.
అంతేకాదు మళ్ళీ అధికారంలోకి వస్తే రప్పా రప్పా తలకాయలు నరుకుతామని, పోలీస్ అధికారులను గుడ్డలు ఊడదీసి రోడ్డుపై నిలబెడతామని కూడా హెచ్చరిస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంచుమించు అలాగే ప్రవర్తించారు. కనుక వైసీపీ అధినేతవి కేవలం బెదిరింపులు కావని ఆయన చేయబోయేదే చెపుతున్నారని అర్ధమవుతోంది.
కనుక చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వలసలు ఆగి ఇక్కడే యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభించాలంటే పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు వస్తూనే ఉండాలి. అందుకు ఇదే విధానాలు, ఆలోచనలు కలిగిన కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం చాలా అవసరం. లేకుంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ విశ్వసనీయత కోల్పోతుంది. అప్పుడు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కూడా కాపాడలేరు.




