ఏపీకి “ప్రత్యేక హోదా”ను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుకు మరింత మద్దతు లభించింది. ఇప్పటికే బీజేపీ మినహా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ సహా, ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా కేవీపీ బిల్లుకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. సభలో ప్రైవేటు బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని తీర్మానించుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు పలు పార్టీల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రస్తుతం తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న ద్రవిడ మున్నేట్ర కగజం (డీఎంకే) ఎంపీ, ఆ పార్టీ అధినేత కరుణానిధి కూతురు కనిమొళిని కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి చర్చలు జరిపారు. తమ బిల్లుకు మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కనిమొళి… సభలో బిల్లు ఓటింగ్ కు వస్తే అనుకూలంగా ఓటేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కేవీపీ బిల్లుకు మరో పార్టీ మద్దతు లభించినట్లయ్యింది. అయితే ఈ బిల్లుపైనే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు.
చరిత్రలో ఎప్పుడైనా ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టంగా మారిందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. బిల్లు వీగిపోతుందని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ప్రారంభించిందని, మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. విభజన రోజున సరిగ్గా వ్యవహరించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తి ఉండేదా? చేయాల్సిందంతా చేసి, ఇప్పుడు నాటకాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ముందుగా సంతోషించేది తానేనని అన్నారు. ఈ బిల్లుపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఎంపీలు చర్చిస్తున్నారని అన్నారు.



