అవును… బాబు పాలనకు జగన్ పాలనకు చాలా తేడా ఉంది

chandrababu-naidu-Jaganఈరోజు విశాఖపట్టణంలో వాహనమిత్ర పధకం నిధుల విడుదల సందర్భంగా సిఎం జగన్మోహన్ రెడ్డి ఆబ్దిదారులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, ఈ మూడేళ్లలో మన ప్రభుత్వం రూ.1.65 లక్షల కోట్లు సంక్షేమ పధకాల రూపంలో ప్రజలకు పంచిపెట్టిందని చెప్పారు. ఇది మన ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ కంటే చాలా ఎక్కువే. అంటే అంత సొమ్ముతో ఒక ఏడాదిపాటు రాష్ట్రం నడిపించవచ్చన్న మాట! కానీ పేద ప్రజలను ఆదుకొంటున్నామనే సాకుతో వైసీపీ ఓటు బ్యాంకు పెంచుకొనేందుకు సంక్షేమ పధకాల పేరుతో జగన్ ప్రభుత్వం డబ్బులు పంచిపెడుతున్న విషయం అందరికీ తెలుసు.

ఈరోజు సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి మరో మాట చెప్పారు. “అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా అప్పులు చేశారు. ఇప్పుడు నా హయాంలోను అప్పులు చేస్తున్నాము కానీ అప్పటి కంటే ఇప్పుడు చాలా తక్కువ అప్పులు చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు హయాంలో దోచుకో… పంచుకో…’ అంటే ఇప్పటి మీ జగనన్న ప్రభుత్వంలో దోచుకోవడమూ లేదు… పంచుకోవడమూ లేదు. అక్కడ ఒక్క బటన్ నొక్కితే నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చి పడిపోతుంటాయి,” అని అన్నారు. కనుక అప్పటి ఆ ప్రభుత్వానికి ఇప్పటి మీ జగనన్న ప్రభుత్వానికి తేడాను గమనించాలని మనవి చేస్తున్నాను,” అని జగన్ అన్నారు.

ADVERTISEMENT

రాష్ట్రావిభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చంద్రబాబు నాయుడు చేతికి వచ్చింది. అక్షయపాత్ర వంటి హైదరాబాద్‌ నగరం తెలంగాణకు వెళ్ళిపోవడంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఒక్కసారిగా తల్లక్రిందులైంది. రాష్ట్రానికి రాజధాని, ఆదాయం రెండూ లేకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వం కొంత అప్పులు చేసిన మాట వాస్తవం. ఆ పరిస్థితులలో సిఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నా అదే పనిచేస్తారు.

కానీ తొలి సంవత్సరం గడిచిన తరువాత రాజధాని అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి పనుల కోసమే అప్పులు చేశారు తప్ప అప్పులు చేసి ఆ సొమ్మును పప్పు బెల్లాలా పంచడం కోసం చేయలేదని అందరికీ తెలుసు.

ఓ పక్క సిఎం కేసీఆర్‌, మరోపక్క జగన్ విసురుతున్న సవాళ్ళను తట్టుకొంటూ, ఆర్ధిక సమస్యలను పంటి బిగువున భరిస్తూ రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు చంద్రబాబు నాయుడు శతవిదాలా ప్రయత్నించిన సంగతి అందరూ కళ్ళారా చూశారు. అయితే ఆ ప్రయత్నంలో కొందరి తప్పుడు సలహాల కారణంగా కొన్ని తప్పటడుగులు వేసి ఇటు ప్రజలను, అటు కేంద్రప్రభుత్వాన్ని దూరం చేసుకొన్నారు. అది వేరే సంగతి.

కానీ అటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి 2014 నాటి క్లిష్ట పరిస్థితులు లేవు. చాలా వరకు సమస్యలు పరిష్కరించబడ్డాయి. కనుక చంద్రబాబు నాయుడు జగన్‌కు వడ్డించిన విస్తరిని అందించినట్లే భావించవచ్చు.

వడ్డించిన విస్తరిని చేతిలో పెడితే జగన్ ఏం చేశారు? రూ.7-8 లక్షల కోట్లు అప్పులు చేసినా రాజధాని కాదు కదా కనీసం ఈ మూడేళ్ళలో ఒక్క భవనం… ఒక్క రోడ్డు కూడా నిర్మించలేకపోగా ఉన్నవాటిని కూల్చేస్తూ, బంగారం లాంటి రుషికొండను నున్నగా గుండు గొరిగినట్లు గొరిగేస్తున్నారు. కనీసం చంద్రబాబు నాయుడు చేసిన పనులలో వందో వంతు కూడా చేయలేకపోయారు. పైగా విద్యుత్‌ సంక్షోభం, పరిశ్రమలకు పవర్ హాలీడేస్, ఛార్జీల మోత మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుక చంద్రబాబు నాయుడు పాలనకు తన పాలనకు చాలా తేడా ఉందనే జగన్ మాట నూటికి నూరు శాతం నిజమే అని అంగీకరించక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories