జిల్లాలలో చంద్రబాబు…. పాదయాత్రతో నారా లోకేష్‌

Chandrababu_Naidu_Nara_Lokeshఒంగోలు మహానాడు విజయవంతం అవడంతో అదే ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఇద్దరూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కో జిల్లాలో మూడు రోజుల చొప్పున రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు. మరోపక్క నారా లోకేష్‌ కూడా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్దం అవుతున్నారు.

ఒంగోలు మహానాడు సభలోనే తాను జిల్లా స్థాయిలో మినీ మహానాడు సభలు నిర్వహిస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ ప్రకారమే ప్రతీ జిల్లాలో తొలిరోజున మహానాడు విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. మర్నాడు స్థానిక పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యి జిల్లాలో రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాబలాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి లోతుగా చర్చిస్తారు. మూడో రోజున జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాలలో చంద్రబాబు నాయుడు పర్యటించి అక్కడి ప్రజలతో ముఖాముఖి మాట్లాడాలని సూత్రప్రాయంగా టిడిపి నిర్ణయించింది. మూడు రోజులకు ఓ జిల్లా చొప్పున చంద్రబాబు నాయుడు మొత్తం 26 జిల్లాలలో పర్యటించేందుకు సుమారు మూడు నెలలు పైనే పట్టవచ్చు.

ADVERTISEMENT

ఇక నారా లోకేష్‌ ఆగస్ట్ 15 లేదా అక్టోబర్ 2 నుంచి ఏకధాటిగా 12 నెలలు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలో పాల్గొనాలని భావిస్తున్నారు. పాదయాత్రలో ప్రధానంగా నియోజకవర్గం స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకొంటూ, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వైఫల్యాలను ప్రశ్నిస్తూ ముందుకు సాగాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా ప్రతిపక్షాలు ఎన్నికల కోసం ఆరాటపడుతుంటాయి కనుక ముందుగా అవే ఇటువంటి కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళుతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు తెచ్చి సంక్షేమ పధకాల పేరుతో పప్పుబెల్లాలగా పంచిపెట్టేస్తున్నప్పటికీ, వాటితో ఓట్లు రాలుతాయో లేవో తెలుసుకొనేందుకు గడపగడపకు కార్యక్రమం ప్రారంభించి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రజల వద్దకు పంపించింది. వారిని అడుగడుగునా ప్రజలు నిలదీస్తూనే ఉన్నారు. విమర్శలు, ఛీత్కారాలు ఎదురవుతూనే ఉన్నాయి.

కనుక చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ ఇద్దరూ రాష్ట్ర పర్యటనలకు బయలుదేరడానికి ఇదే సరైన సమయమని, ఇప్పుడు వారిరువురూ ప్రజల మద్యకు వస్తే టిడిపి ప్రజలకు మరింత చేరువవుతుందని పార్టీలో సీనియర్లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే టిడిపి పొలిట్ బ్యూరో సమావేశమయ్యి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ పర్యటనలపై తుది నిర్ణయం తీసుకోనుంది.

ADVERTISEMENT
Latest Stories