బాధ్యత చేతకాని తనం కాకూడదుగా.?

pawan-kalyan_chandrababu_naidu

ఒక నియంత పాలన నుండి అటు రాష్ట్ర ప్రజలను, ఇటు తమ పార్టీని, పార్టీ నాయకులను కాపాడుకున్నాం అనే గర్వంతో ఉన్న కూటమి నేతలు అధికారం ఇచ్చిన బాధ్యతతో చేతకాని వారుగా మారిపోయారా అంటూ టీడీపీ, జనసేన పార్టీల సొంత క్యాడర్ నుండే ఎదురు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఇందులో మరి ముఖ్యంగా టీడీపీ కార్యకర్తల నుండి ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అటు వైసీపీ పట్ల పవన్ అనుసరిస్తున్న మెతక వైఖరికి జనసైనికులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇంకా వైసీపీ శ్రేణుల నుంచి తమ అధినేతకు సరైన గౌరవం దక్కడం లేదని, అంబటి, పేర్నినాని వంటి నేతల నుండి అదే వెటకారాలు అవే హేళనా పూరిత వ్యాఖ్యలు అంటూ జనసేన శ్రేణులు గగ్గోలు పెడుతున్నారు.

ADVERTISEMENT

ఇక టీడీపీ కార్యకర్తల బాధలైతే వర్ణాతీరమనే చెప్పాలి. 4 దశబ్దాల రాజకీయ అనుభవం, ఐదేళ్ల అణిచివేతకు గురై పార్టీ తన అస్తిత్వానే ప్రశ్నించే స్థాయికి చేరింది. ఇటువంటి దారుణ పరిస్థితుల తరువాత పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది అని ఆనందించే లోపే ఈ అధికారం బాధ్యతనిచ్చింది, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి అంటూ పార్టీ అధినేత చంద్రబాబు నుండి పార్టీ పై స్థాయి నేతల నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు ఆదేశాలు వెళ్లిపోయాయి.

దీనితో గత ఐదేళ్ల తమ ఆవేదనలకు, కన్నీటికి బదులేది అంటూ పార్టీ శ్రేణులు అధినేత నిర్ణయం మీద గుర్రుగా ఉన్నారు. సైకో పోవాలి..సైకిల్ రావాలి అంటూ పార్టీ అధినేత ఇచ్చిన నినాదాన్ని తలకెత్తుకుని వైసీపీ ప్రభుత్వ లాఠీ దెబ్బలకు ఎదురెళ్ళిన పార్టీ నేతలు ఇప్పుడు వైసీపీ పార్టీ మీద రగిలిపోతున్నారు. హలో ఏపీ బై బై వైసీపీ అంటూ వైసీపీ కి ఎదురెళ్ళిన జనసైనికులు ఇప్పుడు ఎదురీతున్నారు.

తమ విషయం పక్కన పెడితే గతంలో బాబు ని బాబు కుటుంబాన్ని అవమానించి, అగౌరవపరిచిన కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వ్యక్తుల విషయంలో కూడా బాబు చేతులు ముడుచుకుని కూర్చోవడాన్ని తెలుగు తమ్ముళ్ళు సహించలేకపోతున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా టీడీపీ ఓపికగా భరించడాన్ని తప్పుబడుతున్నారు.

చివరికి వైసీపీ పార్టీ తరుపున తమ గళం వినిపించే నేతల నోటికి సైతం అధికార పార్టీ కళ్లెం వేయలేకపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఏ ఆధారాలు చూపకుండానే పద్నాలుగేళ్ళు సీఎం గా పని చేసిన వ్యక్తిని జగన్ అరెస్టు చేసి జైలుకు పంపగలిగితే ఈ కూటమి ప్రభుత్వంలో పద్నాలుగు నెలలకు పైగా జైలు జీవితం అనుభవించిన నేతలను సైతం బాబు కట్టడి చేయలేకపోతున్నారా అంటూ నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు.

అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికే కాదు, గత ఐదేళ్లుగా పెట్రేగిపోయిన అరాచక శక్తుల ఆట కట్టించడానికి కూడా అనేది కూటమి ప్రభుత్వం గ్రహించలేకపోతుందా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. బాబు భార్య నుండి పవన్ సతీమణి వరకు ఎవ్వరిని ఉపేక్షించేది లేదనేట్టుగా వైసీపీ సోషల్ మీడియా చేసిన అకృత్యాలు సభ్య సమాజానికి తలవంపుగా మారాయి.

అధినేతల అర్దాంగులకే ఈ రకమైన దుస్థితి ఉందంటే ఇక సామాన్య మహిళా కార్యకర్త విషయంలో వైసీపీ ఎంతటి దారుణాలకు ఒడికట్టిందో ఊహకు కూడా అందవు. ఇటువంటి దారుణ పరిస్థితులను ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వాటికీ చట్ట పరంగా శిక్షలు వేయలేనప్పుడు ఇక వచ్చిన అధికారానికి విలువెక్కడ అంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు రోధిస్తున్నారు.

గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారు ఈ ప్రభుత్వంలో చల్లగా జారుకుంటున్నారు. బాధ్యత అంటే భరించడమా.? అధికారం అంటే ఓపిక పట్టడమా.? ప్రభుత్వం అంటే పాలనే కాదు ప్రత్యర్థుల పాపాలను కూడా సహించడమా.? అంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ అధినేతల అలసత్వం మీద ఆక్రోశం చెందుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories